మహక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం

మాట్లాడుతున్న అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు సుబ్బరావమ్

ప్రజాశక్తి-రంపచోడవరం

ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సబ్బరావమ్మ అన్నారు. రంపచోడవరంలో గురువారం జరిగిన యూనియన్‌ సమావేశంలో సుబ్బరావమ్మ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేస్తామని వికసిత్‌ భారత్‌ అంటూ ఊదగొట్టే ప్రచారం చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ఏమి అభివృద్ధి చేసింది? ఏమి వికసించింది? రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ఏమి వికసింపజేస్తుందని ప్రశ్నించారు. జీవో నెంబర్‌ 3ను రద్దు చేసి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందన్నారు. అటువంటి బిజెపిని, దానికి మద్దతు తెలుపుతున్న తెలుగుదేశం, జనసేన, వైఎస్‌ఆర్‌సిపిలను 2024 ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా అంగన్వాడీలు ఎన్నో పోరాటాలు, సమ్మెలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు నిరవధిక సమ్మె చేయడంతో దిగొచ్చిందని తెలిపారు. సమ్మె సమయంలో ఎన్నో విధాలుగా ప్రభుత్వం అడ్డంకులు కల్పించినా, ఎస్మాను ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించినా, అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చేత తెరిపించినా ఎక్కడా వెరవకుండా పోరాటాన్ని కొనసాగించడంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. సమ్మె విజయవంతం కావడంతో 11 హక్కులను సాధించుకోగా, అందులో సుమారు 6 హక్కులకు జీవోలు కూడా విడుదల కాపడ్డాయని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ఈ హక్కులు అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్తుకు ఎంతో తోడ్పడతాయని చెప్పారు. ఈ సమావేశంలో సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ పాల్గొన్నారు.

➡️