మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి : కలెక్టర్‌

Jan 12,2024 21:44

ప్రజాశక్తి – వీరఘట్టం  :  స్వయం సహాయక సంఘాల్లో గల ప్రతి మహిళా గొప్ప పారిశ్రామిక, వ్యాపార వేత్తగా అడుగులు వేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. వైఎస్‌ఆర్‌ చేయూత మహిళా మార్ట్‌ను వీరఘట్టంలో శుక్రవారం ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌తో పాటు కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మహిళా మార్ట్‌ను పరిశీలించి, స్వయంగా సరుకులను కొనుగోలు చేసి మహిళలను ప్రోత్సహించారు. మహిళా మార్ట్‌లో విక్రయ ప్రక్రియ, బిల్లింగ్‌ ప్రక్రియ, మార్కెటింగ్‌ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాలు బలోపేతమైనందుకు మహిళా మార్ట్‌ నిదర్శనమన్నారు. మహిళలు గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వారని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళల్లో అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, జిల్లాలో అటవీ ఉత్పత్తులు తదితర ఫలసాయాలు పెద్ద ఎత్తున మార్కెటింగ్‌ చేసేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌ వీరఘట్టం మండలంలో 1756 సంఘాల్లో 19316 మంది సభ్యులున్నారని తెలిపారు. సంఘ సభ్యులు వద్ద షేర్‌ కాపిటల్‌గా రూ.30 లక్షలు ఉందని తెలిపారు. మహిళా మార్ట్‌ నిర్మాణానికి రూ.16.19 లక్షలు వ్యయం చేశారని చెప్పారు. మహిళలు వ్యాపార రంగంలో ముందంజ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా సరుకులు పంపిణీకి చర్యలు చేపట్టిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, అనధికారికారులు, మహిళలు పాల్గొన్నారు.

➡️