మహిళా హక్కుల పై ప్రభుత్వాల దాడి

Mar 10,2024 21:48

ప్రజాశక్తి – సాలూరు: మహిళా హక్కుల పై దాడులు చేస్తున్న ప్రభుత్వాలపై పోరాటానికి పిడికిలి బిగించాలని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీదేవి పిలుపునిచ్చారు.అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో శ్రామిక మహిళా సంఘం నాయకులు శశికళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. మణిపూర్‌ లో ఒక వర్గం మహిళలపై ప్రభుత్వమే దాడులు ప్రోత్సహించిందని చెప్పారు. అలాంటి దాడులను రాష్ట్రం లోని పాలక పార్టీలు కనీసం ఖండించలేదన్నారు. మహిళా సాధికారత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. మహిళా చట్టాలను అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు. ఇలాంటి ప్రభుత్వాలపై ఐక్యం గా పోరాడాలని కోరారు.అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా జ్యోతి, యుటిఎఫ్‌ జిల్లా కమిటీ సభ్యులు కోలక లీల, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు జ్యోత్స్న, భోజన నిర్వాహకుల సంఘం నాయకులు సుశీల, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ మహిళా నాయకులు దేవి ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు భారతి, కుమారి, జానకి ,శాంత ,సుజాత, పోలమ్మ ,ఉత్తరమ్మ, తిరుపతమ్మ ,పుష్ప, నారాయణమ్మ, గౌరీ ,ఇందిరా, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కొమరాడ : మహిళలకు ఉపాధి సాధికారిత, అభివృద్ధి ఎక్కడ ఉందని మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కార్యదర్శి వై.శాంతికుమారి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యాన అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు కొమరాడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ అధ్యక్షతన జరిగిన సభలో శాంతకుమారి మాట్లాడారు. కేంద్రంలో బిజెపి మహిళలకు రక్షణ లేకుండా చేస్తుందని, పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను చట్టాలను కాలరాస్తూ పాతకాలమునాటి పరిస్థితికి తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌ ఘటన యావత్‌ భారతదేశాన్ని కలిసి వేసిందని ఇటువంటి ఉన్మాదుల వల్ల మహిళలకు ఎటువంటి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, అంగన్వాడీ, ఆశా, కమ్యూనిటీ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

➡️