మహోన్నత నేత జ్యోతిబసు

విశాఖలో జ్యోతిబసు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి-అనకాపల్లి

ఎన్నో ఉన్నతమైన అవకాశాలున్నా వాటిని వదులుకొని కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీలో చేరి, తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన మహోన్నత నేత జ్యోతి బసు అని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమనేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్‌ జ్యోతిబసు 14వ వర్ధంతి సభ బుధవారం అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.శంకరరావు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు జ్యోతిబసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు, వరుసగా 5 సార్లు పనిచేసి రికార్డు నెలకొల్పారని తెలిపారు. 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని భావించి తిరస్కరించిన మహానేత జ్యోతి బసు అని పేర్కొన్నారు. 1914 జులై 8న కోల్‌కతాలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించారని తెలిపారు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారని, కార్మికోద్యమ నేతగా ఎదిగారని చెప్పారు. సమాజ సేవ కోసం కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారన్నారు. బిసి.రారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహహరించారని తెలిపారు. దేశంలోనే భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూములు పంచారని చెప్పారు. అనేక కార్మిక పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌, జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, నాయకులు ఉమా మహేశ్వరరావు, కె.తేల్లయ్యబాబు, శివాజీ, చలపతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబసు వర్థంతి సభ ఎంవిపి.కాలనీ : మద్దిలపాలెంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జ్యోతిబసు 14వ వర్థంతి సభను బుధవారం ఘనంగా నిర్వహించారు. మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతిబసు చిత్రపటానికి సిపిఎం నాయకులు జివిఎన్‌.చలపతి, సిహెచ్‌ఎల్‌ఎన్‌.శాస్త్రి, ఎవి.పద్మావతి, డాక్టర్‌ బి.గంగారావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీలు, మున్సిపాలిటీలు తమ స్వతంత్రను కాపాడుకునే వ్యవస్థను ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రజలకు మంచి పరిపాలన అందించిన పరిపాలనా దక్షుడని కొనియాడారు. 23ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ పదవిని తరువాతి తరానికి అందించిన గొప్ప మహనీయుడన్నారు. పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా అమలుచేసిన గొప్ప కమ్యూనిస్టు, నిరాడంబరుడు, అధ్యయనశీలి అని కొనియాడారు. బెంగాల్‌, త్రిపుర రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వాలను పడగొట్టాలని పెట్టుబడిదారులు, మతతత్వ శక్తులు తీవ్ర కృషిచేశాయని తెలిపారు. నేడు కేరళను కూడా వామపక్ష ప్రభుత్వంపై పెద్దఎత్తున దాడికి దిగుతున్నాయన్నారు. వామపక్షప్రభుత్వం బెంగాల్‌లో ఉన్న కాలంలో మతఘర్షణలకు తావివ్వకుండా పరిపాలన సాగిందరి గుర్తుచేశారు. నేడు దేశంలో మతతత్వ శక్తులు పుంజుకోవడంతో దేశభ్రదతకు, లౌకికతత్వానికి పెద్దప్రమాదం ఏర్పడిరదన్నారు. అంతరాలు లేని సమాజం కోసం నేడు ప్రజలను కదిలించి దోపిడీ వ్యవస్థను కూల్చడం, మతతత్వ రాజకీయలను తిప్పికొట్టడమే నేడు మనముందున్న సవాల్‌ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పీతల అప్పారావు, వి.తులసీరాం, దండునాగేశ్వరరావు, ఎం.ప్రదీప్‌, జివి.రమణ, రమాప్రభ, కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️