మాజీ సిఎం జ్యోతిబసుకు నివాళి

Jan 17,2024 23:37
స్వాతంత్య్ర సమర యోధుడు, సిపిఎం

ప్రజాశక్తి – కాకినాడ

స్వాతంత్య్ర సమర యోధుడు, సిపిఎం వ్యవస్థాపక పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు సిపిఎం నగర కమిటీ ఘనంగా నివాళులర్పించింది. బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జ్యోతిబసు 14వ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిబసు చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్‌.శ్రీనివాస్‌, నగర కమిటీ సభ్యులు కె.సత్తిరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ లోనే అభ్యుదయ మార్గంలో పయనించి భారత కమ్యూనిస్టు ఉద్యమ తొలితరం నేతగా, కార్మి కోద్యమ నేతగా కృషి చేశారని కొనియాడారు. సిపిఎం వ్యవస్థాపక పొలిట్‌ బ్యూరో సభ్యుడుగా, 1977 నుంచి 23 సంవత్సరాలపాటు ముఖ్య మంత్రిగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి సేవలు అందించి చరిత్ర సృష్టించారని తెలిపారు. సోషలిజం విశిష్టతను చాటుతూ బెంగాల్‌లో అంతర్జాతీయ సెమినార్‌ నిర్వహణలో జ్యోతిబసు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. 1996లో ప్రధానమంత్రి ప్రతిపాదన వచ్చినప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి తిరష్కరించారన్నారు. 96 ఏళ్ళు జీవించిన జ్యోతిబసు కడవరకు కష్టజీవుల శ్రేయస్సు కోసం తపనపడ్డారని తెలిపారు. మతో న్మాదం వెర్రితలలు వేస్తున్న నేటి తరుణంలో జ్యోతి బసు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబుతోపాటు నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్‌, కె.నాగజ్యోతి, మరియు విజయ, వసంత, యు.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️