మిచౌంగ్‌ ముప్పు..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

మిచౌంగ్‌ తుపాను ప్రభావం జిల్లాను కుదిపేస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. మంగళవారం మచిలీపట్నం-బాపట్ల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో తుపాను ప్రభావం రెండు జిల్లాలపైనా తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షంతో జిల్లా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అన్నదాతకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. చేతికొచ్చిన పంట దక్కుతుందో లేదోనన్న ఆందోళన రైతులకు నిద్రలేకుండా చేస్తోంది. ఖరీఫ్‌ సాగులో 60 శాతం పంట పొలాల్లోనూ, కళ్లాల్లోనూ ఉండిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆరబెట్టిన ధాన్యం సైతం తడిసిముద్దవుతోంది. ఖరీఫ్‌లో ఏలూరు జిల్లావ్యాప్తంగా 1,93,398 ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా ఇప్పటి వరకూ 89,542 ఎకరాల్లో 45 శాతం మాత్రమే మాసూళ్లు పూర్తయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయగా ఇప్పటి వరకూ 30,600 ఎకరాల్లో 35 శాతం మాత్రమే మాసూళ్లు పూర్తయిన పరిస్థితి ఉంది. రెండు జిల్లాల్లో సరాసరిన లెక్కిస్తే ఇంకా 60 శాతం పంట పొలాల్లోనూ, కళ్లాల్లోనూ ఉండిపోయింది. పంట చివరి దశలో మిచౌంగ్‌ తుపాను విరుచుకుపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. మాసూళ్లు చేసిన ధాన్యం సైతం రోడ్లపైన, కళ్లాలోనే ఉండిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 31 వేల టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో వెంటనే తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలతో సంబంధంలేకుండా ఆఫ్‌లైన్‌లో రైతులు తమకు నచ్చిన మిల్లుకు తరలించుకోవచ్చని జిల్లా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విధంగా విక్రయిస్తే తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు కాకుండా, ఇబ్బందులు పడి, ధాన్యం సొమ్ము రాకపోవడం వంటి గత సంఘటనలను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో నాలుగు నెలల్లో జులైలో మినహా మిగిలిన రోజుల్లో సరిపడా వర్షాలు కురవలేదు. తీరా పంట చేతికొచ్చే తరుణంలో తుపాను వెంటాడుతోంది. తుపానుతో విరుచుకుపడుతున్న ఈదురుగాలులకు ధాన్యంను కాపాడుకునేందుకు బరకాలు సైతం వేయలేని పరిస్థితి నెలకొంది. బరకాలు గాలికి ఎగిరిపోతున్నాయి. దీంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. కోతకోయని పొలాలన్నీ గాలులకు నేలకొరిగిపోతున్నాయి. కళ్లాల్లో ధాన్యం కాపాడుకోవడం రైతులకు కత్తిమీద సాములా మారింది. పండిన పొలాలు కళ్లముందే నేలకొరుగుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటను ఏవిధంగా కాపాడుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. శని, ఆదివారాల్లో మాసూళ్లు చేసిన ధాన్యం తడిగా ఉండటంతో రాశులుగా ఉంచడం ఇబ్బందికరంగా మారింది. తడిధాన్యం కావడంతో మొలకలు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇదే అదునుగా దళారులు అయికాడికి ధాన్యం అడుగుతున్నట్లు రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు రూ.35 వేలకు పైగా రైతులు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే తరుణంలో విపత్తు సంభవించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రబీ నారుమడులపైనా ప్రభావం ఈ నెల 15వ తేదీకల్లా రబీ నారుమడులు పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. దీంతో ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తయిన ప్రాంతాల్లో తాడేపల్లిగూడెం, తణుకు, గణపవరం, పెంటపాడు, నిడమర్రు, ఉంగుటూరు వంటి అనేక మండలాల్లో రబీ నారుమడులు ముమ్మరంగా సాగుతున్నాయి. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నారుమడులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరోసారి నారుమడులు వేయాల్సి వస్తుందేమోననే భయం రైతులను వెంటాడుతోంది. దీంతో రైతులు నారుమడులు వేయడం నిలిపివేశారు. తుపాను తీరందాటే సమయంలో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎంతమేరకు నష్టం చేకూరుస్తుందోననే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తం తుపాను ప్రభావం రెండు జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆహారం, తాగునీరు వంటివి ముందస్తుగా సిద్ధం చేసుకుంటున్నారు. మాసూళ్లు చేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు సెలవులు పెట్టకూడదని ఆదేశాలు జారీచేశారు. నిరంతరం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

➡️