మిమ్స్‌ ఉద్యోగులు పోరాడి సాధించుకోవాలి

Mar 10,2024 20:31

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని కొనసాగించి సమస్యలకు పరిష్కారం సాధించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నర్సింగరావు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 39 రోజులుగా చేస్తున్న నిరశన శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, దుర్మార్గాలకు విసిగి వేసారిపోయి బానిసలుగా బతకలేక ఉద్యోగులు, కార్మికులు బయటకు వచ్చి సిఐటియుని ఆశ్రయించారన్నారు. సిఐటియుకి రెచ్చగొట్టే అవసరంలేదని ఉద్యోగులు, కార్మికులు సిఐటియు తలుపు తడితేనే పోరాటానికి వచ్చిందని గుర్తు చేశారు. ఓపికతో పోరాటం చేస్తే సమస్య పరిష్కారమవుతోందని చెప్పారు. అంగన్‌ వాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, అధికార్లు, ప్రజాప్రతినిధులు యాజమాన్యాలకు కొమ్ము కాస్తాయని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే సాక్షిగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులకు 7డిఎ బకాయిలు, వేతన ఒప్పందం చేసి జనవరి నెల జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా పోరాడితే యాజమాన్యాలు, ప్రభుత్వాలు తోక ముడిచి పారిపోతాయని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.మోహన్‌ రావు, రాష్ట్ర నాయకులు డి.రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి కెవిఆర్‌కె ఈశ్వర రావు, జిల్లా అధ్యక్షులు రమేష్‌ చంద్ర పట్నాయక్‌ శిబిరానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి. రమణ, సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు ఎం.నారాయణ, కె.మధు, ఎం. నాగభూషణం, బంగారునాయుడు, మూర్తి, గౌరి, వర లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️