మీ సేవలో కుల ధ్రువపత్రం తొలగింపు..

మీ సేవలో

ప్రజాశక్తి-కాట్రేనికోన ప్రభుత్వానికి ఆర్భాట ప్రచారం తప్ప ప్రజా ప్రయోజనాలు, సౌకర్యం వారికి అవసరం లేదు. గ్రామ సచివాలయాలను కాపాడుకోవడానికి మీసేవ కేంద్రాలను నిర్వీర్యం చేయడం తప్ప వేరే పని లేనట్టుగా ఉంది. ఎప్పటి నుంచో ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండే మీ సేవ కేంద్రాల్లో తాజాగా రెవెన్యూ శాఖలోని కులం సర్టిఫికెట్‌ దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని తొలగించింది. గతంలోనే కొత్త రేషన్‌ కార్డులుకు దరఖాస్తు, చేర్పులు మార్పులు, ఓటరు నమోదు, మ్యారేజ్‌ సర్టిఫికెట్లు, లేబర్‌ సర్టిఫికెట్లు తదితర ముఖ్యమైన సేవలను తొలగించింది. దీంతో నేడు ప్రజలు గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా ఇక్కట్లూ పడుతున్నారు. దీనికి తోడు తాజాగా విద్యార్థులు, నిరుద్యోగులకు అత్యవసరమైన కులం సర్టిఫికెట్‌ కూడా తొలగించడంతో మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. మీ సేవ కేంద్రాల ద్వారా ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్లు పొందే సదుపాయం ఉండేది. ప్రభుత్వ కొత్త నిర్ణయం వల్ల విధిగా తమ పరిధిలోని సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో బయట ఆన్లైన్‌ మీసేవ పోర్టల్‌, ఎపి సేవ పోర్టల్‌ ద్వారా దరఖాస్తుదారులు ఎక్కడి నుంచైనా లేదా ఇంటి వద్ద నుంచి తమ సొంత ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేదా కంప్యూటర్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించడంతో సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. కేవలం గ్రామ సచివాలయాల ఉనికిని కాపాడుకోవడానికి లావాదేవీలు సంఖ్య పెంచుకోవడానికి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ నానా తంటాలు పడుతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఉన్నతాధికారులు సైతం మీసేవ కేంద్రాల్లో ఏకపక్షంగా సర్వీసులను ఎందుకు తొలగిస్తున్నారో ఎవరికి పాలు పోవడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు కూడా విచారణలో ఉంది. ఇప్పటికే మీ సేవ వ్యవస్థ రాష్ట్రంలో ఉండగా మరో సమాంతర వ్యవస్థను తెచ్చినప్పుడు మీ సేవ నిర్వాహకులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజలు పడుతున్న ఇక్కట్లు తెలిసినా ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ నిర్ణయాలపై నోరు మెదపడం లేదనే ఆరోపణ ఉంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల చాలామంది మీసేవ నిర్వాహకులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని మీసేవ కేంద్రాలు మూతపడ్డాయి. చాలీచాలని ఆదాయంతో, నష్టాలతో నిర్వహించలేక మిగిలిన కేంద్రాలు మీసేవ బోర్డులకే పరిమితమయ్యాయి. సచివాలయ సిబ్బంది లేనప్పుడు, సెలవు రోజుల్లోనూ అన్నివేళలా అందుబాటులో ఉండే మీ సేవ కేంద్రాల్లో సర్వీసులు తొలగించిన కారణంగా ప్రజలు పడే పాట్లను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది చాలదా అన్నట్టు ఒకపక్క సర్వీసులను ఇష్టారాజ్యంగా తొలగిస్తూ మీ సేవా కేంద్రాలపై పెత్తనం తనిఖీలను ప్రభుత్వం పెంచింది. మీ సేవ కేంద్రాలను ప్రచారానికి ఉపయోగించుకునేందుకు ఉన్న శ్రద్ధ ప్రజలకు వీటి ద్వారా సేవలు అందించడంలో ప్రభుత్వ విఫలమైందని చెబుతున్నారు. మీసేవ సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఫోటోను ప్రచురించడంతో పాటు ఇటీవల మీ సేవ కేంద్రాల్లో సిఎం ఫోటోతో కూడిన జగనన్నకు చెబుదాం వాల్‌ పోస్టర్‌ను విధిగా ప్రజలందరూ చూసేలా గోడకు అంటించాలని అధికారికంగా ఆదేశించారు. దీంతో ఆదాయం లేకున్నా వ్యయ ప్రయాసలకు ఓర్చి పోస్టర్లు అంటించుకోవలసి వచ్చింది. మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్‌ ఫీజులు పెంచేశారు. మీ సేవ సర్టిఫికెట్లు స్టేషనరీని రెండింతలు పెంచడంతోపాటు, మీ సేవ రసీదులకు కూడా ప్రభుత్వ నిర్వాహకుల నుంచి సొమ్ము వసూలు చేస్తోంది. ఇది చాలదా అన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా మీ సేవ కేంద్రం నిర్వాహకులకు బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో నిర్వాహకులు నరకాన్ని చూస్తున్నారు. తాజాగా ఐరిష్‌ విధానం తెచ్చి నిర్వాహకులపై మరింత భారాన్ని మోపింది. ప్రభుత్వం సూచించిన కంపెనీ ఐరిష్‌ పరికరాన్ని మాత్రమే దాదాపు రూ.7 వేలతో కొనుగోలు చేసి మీ సేవ నిర్వహించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వాహకులకు సాధ్యం కాని పని అంటూ వాపోతున్నారు. ఒకపక్క రోజురోజుకు కేంద్రాల్లో సేవలు తొలగిస్తున్న ప్రభుత్వం కొత్త నిబంధనలు పెడుతూ వేదనకు గురి చేస్తోందని, ఇది పొమ్మనలేక పొగ పెట్టినట్లేనని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

➡️