ముంచిన మిచౌంగ్‌..!

ప్రజాశక్తి – ముదినేపల్లి

మిచౌంగ్‌ తుపాను రైతులను నట్టేముంచింది. చేతికొచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో ఏమిచేయాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు. మండలంలో ముమ్మరంగా కోతలు, నూర్పిళ్లు జరుగుతున్న తరుణంలో అకస్మాత్తగా వచ్చిన తుపాను రైతులను కోలుకోలేని దెబ్బకొట్టిందని లబోదిబోమంటున్నారు. ఈదురుగాలులు, భారీ వర్షానికి మండలంలోని చాలాగ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలింది. కల్లాల్లో, చేలగట్ల మీద, రోడ్ల వెంబడి యంత్రాలతో కోసి అరబెట్టిన ధాన్యాన్ని రైతులు పరదాలు కప్పి కాపాడునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజామున మొదలైన గాలి, వాన రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. దీంతో రైతులు ధాన్యపు రాశులపై పరదాలు కప్పి పంటను రక్షించుకునే పనుల్లో నిమగమయ్యారు. దీంతో పరదాలకు గిరాకీ ఏర్పడింది. పలు గ్రామాల్లో కోసి పనలపై ఉన్న వరిపైరు వర్షానికి తడిసిపోయింది. వర్షాలు ఇలాగే కురిస్తే వరిగింజలు నీటిలో నాని రంగుమారి మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పనలపై ఉన్న పంటను కుప్పలు వేసేందుకు కూలీలు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గాలులకు వరిపైరు నేలకొరగడంతో రైతులు మరింత అందోళన చెందుతున్నారు. మచిలీపట్నం వద్ద తుపాన్‌ తీరం దాటుతుందన్న హెచ్చరికలతో ముదినేపల్లి మండలం అత్యంత సమీపంలో ఉండడంతో మండల రైతాంగం గజగజ వణుకుతున్నారు. ముసునూరు:తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతను నట్టేట ముంచాయి. మండలంలో సాగుచేసిన వరి, పత్తి చేతికొచ్చే సమయం కావడంతో ప్రస్తుత వర్షాలు తీవ్రనష్టాన్ని కలిగించాయి. రబీ సీజన్‌లో మొదలైన పొగాకు, మొక్కజొన్న, మిర్చి పంటలు వర్షం దెబ్బకు వేరుకుళ్లు తెగులు, పాసి తెగులు ఆశించి పంటలు పూర్తిగా కుళ్లి పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నవంబర్‌, డిసెంబర్‌లో తుపాన్‌లు రావడం ప్రమాదకరమని వాపోతున్నారు.జీలుగుమిల్లి : మిచౌంగ్‌ తుపాన్‌ రైతులను కలవర పెడుతోంది. మండలంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం పడుతూనే ఉండటతంతో రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు. మండలంవ్యాప్తంగా కొన్ని వందల ఎకరాల్లో వరి, వేరుశనగ పంట చివరి దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో తుపాన్‌ రావడంతో చేతికి వచ్చిన పంటలను ఒబ్బిడి చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అవేదన చెందుతున్నారు. భీమడోలు:మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో మండలంలో మోస్తరువర్షం కురిసింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చేసిన ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకున్నారు. రెండు రోజులుగా వరి కోతలు నిలిపివేశారు. వ్యవసాయ క్షేత్రాల్లోని వరి పనలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. సుమారు 13 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రోడ్లపై రాశులుగా ఉంది. మరో మూడు వేల టన్నులు పొలాల్లో ఉంది. ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆఫ్‌లైన్‌ ద్వారా, బ్యాంకు గ్యారెంటీతో నిమిత్తం లేకుండా సమీపంలో అందుబాటులో ఉన్న మిల్లులకు ఆర్‌బికెల ద్వారా ధాన్యాన్ని తరలించేందుకు అనుమతించింది. తాజాగా సిఎం జగన్‌ తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం ఉదయం నుంచి భీమడోలు వ్యవసాయాధికారి పి.ఉషారాజకుమారి, ధాన్యం తరలించే విషయమై రైతులను అప్రమత్తం చేశారు. జిపిఎస్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న లారీలు, ట్రాక్టర్లతో ధాన్యం రవాణాకు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వరకూ సుమారు 300 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. వాతావరణం అనుకూలిస్తే మరో మూడు వేల టన్నుల వరకూ ధాన్యం తరలించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ పాఠశాలలను మూసివేశారు. భీమడోలులో తాత్కాలిక హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు కొల్లేరు ప్రాంత ప్రజలను రక్షించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. మండలంలోని మల్లవరం, చెట్టున్నపాడు, కోరుకొల్లు, ఆగడాలలంక, ఎంఎం.పురం గ్రామాల్లోని తుపాను రక్షిత భవనాలు శిధిలమైన నేపథ్యంలో పాఠశాలల్లో పునరావాసం కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

➡️