ముంచిన మిచౌంగ్‌

Dec 6,2023 00:01
మిచౌంగ్‌

జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఈధురుగలులతో విధ్వంసం
నీటిలో నానుతున్న ధాన్యం రాశులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, యంత్రాంగం
మిచౌంగ్‌ తుపాను రైతులను నిండా ముంచింది. భారీ వర్షం పంటలను ముంచెత్తింది. మరో పక్క ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షానికి జిల్లా తడిసి ముద్దయ్యింది. జనజీవనం స్తంభించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. తీరాన్ని దాటుతుందనే వార్తలతో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.
అన్నదాతలకు తీరని నష్టం
పంట చేతికందే సమయంలో తుపానుతో అన్నదాతలు తీరని నష్టం వాటల్లింది. పనలపై ఉన్న పంట వర్షపు నీటిలో నానుతోంది. పలుచోట్ల ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం రెండు రోజులు పాటు హడావుడి చేసినా పూర్తిస్థాయిలో పంటను కాపాడటంతో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో 1.75లక్షల ఎకరాల్లో వరి సాగు జరితే 60 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 40 శాతం పంటలో చాలా వరకూ నేలకొరిగింది. సుమారు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ప్రభుత్వం 90వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. మరో 60వేల మెట్రిక్‌ టన్నులను వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా రైతులు వద్దనే ఉంది. ఈ ధాన్యంలో 19వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కళ్లాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కలెక్టరు ఆధ్వర్యంలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి ఆది, సోమవారాల్లో విస్తృతంగా పర్యటించి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నులు తరలించామని చెబుతున్నారు. మిగిలిన 9 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే తడిసినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారిక లెక్కలు ఇలా ఉన్నా 50 వేట మెట్రిక్‌ టన్నులకుపైగానే ధాన్యం తడిసినట్టు రైతులు చెబుతున్నారు. గోకవరం, కొవ్వూరు, పెరవలి పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి.
నిబంధనలు ముందే సడలించి ఉంటే…
తుపాను ముందు వరకూ తేమ ఇతర నిబంధనలతో ఆర్‌బికెల్లో కొనుగోళ్లు సరిగా నిర్వహించలేదు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం సిఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిబంధనలను సడలించి తేమ ఉన్నా, లేకున్నా ధాన్యన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అప్పటికే వర్షం మొదలైంది. సోమవారం, మంగళవారం ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు హడావుడి చేశారు. కాని పూర్తిస్థాయిలో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడలేకపోయారు. ముందుగానే నింబధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని, దళారుల వద్ద మోసపోయేవాళ్లం కాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.
ఈదురుగాలుల బీభత్సం
తుపాను నేపథ్యంలో మంగళశారం మధ్యాహ్నాం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, సుడిగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. రాజమహేంద్రవరం నగరంలో జెఎన్‌ రోడ్డులో వ్యాపార సముదాయాల ఎదుట ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు గాలికి ఎగిరి పడటంతో స్థానికులు భయాందోళనకు గుర య్యారు. రామాలయం సెంటర్‌, మోరంపూడిల్లో భారీ హోర్డింగ్‌లు గాలికి ఎగిరిపడ్డాయి. మోరంపూడిలో కార్మికులు ఉంటున్న ఒక తాత్కాలిక షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మోరంపూడి ప్రాంతంలో సుడిగాలులకు ఒక అపార్ట్‌మెంట బీటలు వారింది. మూడు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. పాఠశాలలకు సెలవు ఇవ్వటంతో విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు.
జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 34.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా నల్లజర్ల మండలంలో 111.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా బిక్కవోలులో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం డివిజన్‌లో గోకవరంలో అత్యధికంగా 49.2 మిల్లీమీటర్లు ఎంఎం, రాజమహేంద్రవరం రూరల్‌లో 21.2 ఎంఎం చొప్పున వర్షపాతం నమోదైంది. కొవ్వూరు డివిజన్‌లో నల్లజర్లలో 111.6 మిల్లీమీటర్లు, దేవరపల్లిలో 50 మిల్లీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది.
మండలాల్లో ఇదీ పరిస్థితి…
గోకవరం మండలంలో 15 వేలఎకరాల్లో వరి పంట, 5 వేల ఎకరాల్లో దుంప తోటలు, మరి కొద్ది ఎకరాల్లో అరటి తోటలు సాగు చేవారు. వర్షాలకు కళ్లాలపై వరి పంట పూర్తిగా తడిసి ముద్దయ్యింది. దుంప తోటలు పక్వానికి రావడంతో వర్షాల వల్ల భూమి లోపల ఉన్న దుంప తోటలు ఊటెక్కిపోయాయి. ఫలితంగా దుంప కుళ్లిపోయే ప్రమాదం తలెత్తింది. గాలివానకు అరటి తోటలో నేలకొరిగాయి. తమను ఆదుకోవాలనిరైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాగల్లు మండలంలో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఎర్పడింది. చాగల్లు పంచాయితీలోని 8 మోటార్లు ఆగిపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బంది పడ్ధారు. విద్యుత్‌, వాటర్‌ వర్కర్స్‌ సిబ్బంది మెరుగుపరచటానికి కషి చేస్తున్నారు. చలి పెరగడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుపాను వల్ల సహకారం పొందేవారు సమచారం ఇవ్వాలని తహశీల్దార్‌ కె.రాజ్యలక్ష్మి తెలిపారు.
ఉండ్రాజవరంలో తుపాను ప్రభావం పంటలపై స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉందని మండల ప్రత్యేక అధికారి ఎం.సందీప్‌ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి ఎం విశ్వాస రావు, ఉండ్రాజవరం విఆర్‌ఒ పాపారావు లతో కలిసి ఆయన మండలంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. 600 ఎకరాల వరి పంటపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ సిబ్బంది నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లపూడిలో భారీ వర్షం కురిసింది. తుఫాను తీరానికి చేరిన సమయంలో సమయంలో రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భారీ వర్షం కురిసింది. 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని గణాంకాధికారి జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తహశీల్దార్‌ రాధిక తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారి రుచిత మాట్లాడుతూ రైతులు కోసిన వరిని ఆర్‌బికెల ద్వారా మిల్లులకు చేర్చుతున్నామన్నారు. కుప్పలుగా ఉన్న వరి తడవకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పెరవలి మండలంలో ఈదురు గాలులు, భారీ వర్షాలకు వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. మంగళవారం సుడిగాలికి ఉమ్మడివారిపాలెం, ముక్కామల, కాకరపర్రు, తీపర్రులో కొబ్బరి, మామిడి చెట్లు, మూడు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు అన్నవరప్పాడు నల్లాకులవారిపాలెం కానూరు పెరవలి తదితర ప్రాంతాలలో ఉన్న ఇటుకల బట్టీలోకి నీరు చేరడంతో పచ్చి ఇటుకలకు నష్టం వాటిల్లింది. ముక్కామలలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత సరఫరా నిలిపేసింది. దీంతో విద్యుత్‌ సిబ్బంది సకాలంలో స్పందించి పునరుద్దరించారు. విరిగిన కొబ్బరి చెట్లను కరెంట్‌ స్తంభాలను దెబ్బతిన్న పశువులపాకలను నీట ముడిగిన వరి చేనులను సర్పంచ్‌ కేతాత్రిమూర్తులు పరిశీలించారు.
గోపాలపురంలో 80 హెక్టార్లలో పంట పొలాలు నీటిలో మునిగాయని ఎఒ రాజారావు తెలిపారు. అత్యధికంగా వెంకటాయపాలెం, భీమోలు గ్రామాల్లో 60 హెక్టార్లు వరి పంట నీట మునిగినట్లు తెలిపారు. 8 ఎకరాల్లో వేరుశనగ పంట తడిసిందన్నారు. 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఎఎస్‌ఒ జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు.

➡️