మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

Dec 30,2023 22:33
ఫొటో : కావలి పట్టణంలో అర్ధనగంగా ప్రదర్శన చేపడుతున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : కావలి పట్టణంలో అర్ధనగంగా ప్రదర్శన చేపడుతున్న మున్సిపల్‌ కార్మికులు
మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్యాలయం నుండి కార్మికులు వినూత్న రీతిలో అర్ధ నగంగా పనిముట్లు చేత పట్టుకొని ప్రదర్శనగా బయల్దేరి బిపిఎస్‌ సెంటర్‌, ఉదయగిరి బ్రిడ్జి వరకు మళ్లీ అక్కడి నుండి తిరిగి కోర్టు సెంటర్‌ మార్కెట్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయానికి ప్రదర్శన చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు పరిష్కరించలేదని, ఎన్నిసార్లు పరిష్కరించాలని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుంది తప్ప కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చేటప్పుడు కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి ముఖ్యంగా మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారని, అవి నేటికీ అమలు చేయకుండా తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తున్నారని ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. గద్దెనెక్కేటప్పుడు ఒక మాట.. ఎక్కిన తరువాత మరొక మాట చెప్పడం అన్యాయమన్నారు. ఇదేనా నవరత్నాల పాలన అంటే అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులు నిద్రలేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు పనులు నిర్వహిస్తున్నారని ప్రజా ఆరోగ్యానికి హాని కలగకుండా శుభ్రత చేసి ఉంచుతున్నారని అలాంటి వారికి జీతాలు పెంచకపోవడం పర్మినెంట్‌ చేస్తానని హామీనిచ్చి చేయకపోవడం ఇది చాలా అన్యాయమన్నారు. తక్కువ జీతాలతో వారి కుటుంబాలు నడవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పెరిగిన ధరలతో కొని తినలేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బిడ్డల మహేష్‌, ఒంగోలు రమేష్‌, జలదంకి సీనయ్య, కే బాబు, ఎన్‌ క్రాంతి కుమార్‌, మస్తాన్‌, మహిళా నాయకులు పి చిన్నమ్మ, రాజ్యలక్ష్మి, నారాయణమ్మ, సునీత, కే రాజేశ్వరి, గద్దె రాగమ్మ, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️