మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Jan 3,2024 23:24
సమస్యలు పరిష్కరించాలంటూ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత తాడితోటలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌవర అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ పురపాలక శాఖా మంత్రి సురేష్‌తో రాష్ట్ర జెఎసి చేసిన చర్చయలు విఫలం అయ్యాయని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే కార్మికులు సమ్మెలోకి దిగారని అన్నారు. సమ్మెను ఆపాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ధర్నాలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పాల్గొని కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. తక్షణమే మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చిన నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు. కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వి.కొండలరావు, సింగిరెడ్డి వెంకటరమణ, ముత్యాల మురళీకృష్ణ, ఎపి రెల్లికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు, బి.తాతారావులు సంఘీభావం తెలిపారు.

➡️