మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం

ఆస్పత్రి వాహనంలో మృతదేహాన్ని తరలిపజేస్తున్న జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) నుంచి మృతదేహాల తరలింపు ప్రహసనంగా మారింది. పలుకుబడి, సిఫార్సులు ఉంటేనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మహాప్రస్థాన వాహనంలో మృతదేహాలను తరలిస్తున్నారు. లేదంటే వేలాది రూపాయాలు వెచ్చించి ప్రైవేటు వాహనాలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఈవిషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కూడా పట్టించుకోవడం లేదు. జిజిహెచ్‌కి రోజుకు మూడు వేలు నుంచి నాలుగు వేల మంది రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోజుకు 10 నుంచి 20 మందికి పైగా మృతి చెందుతున్నారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించాలంటే కనీసం 15 మహా ప్రస్థాన వాహనాలు అవసరమని అధికారులు గతంలోనే గుర్తించారు. ప్రస్తుతం ఏడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాహనాల సంఖ్య పెంచాలని మహాప్రస్థానం సంస్థ నిర్వాహకులు ఆస్పత్రి అధికారులు కోరినా పట్టించుకోలేదు. రాత్రి సమయాల్లో తమ వాహనాలను వినియోగించలేమని ఖరాఖండిగా చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. మృతదేహాలను తమ స్వగ్రామాలకు తరలించాలని వత్తిళ్లు చేస్తున్నారని, మహాప్రస్థానం వాహనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. అనేకమార్లు గొడవలు కూడా చేస్తున్నారన్నారు. ఆస్పత్రి ఉన్నతాధికారుల సిఫార్సులుంటేనే పంపిస్తున్నారని, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా లెక్క చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మృతదేహాలను తీసుకెళ్లకుంటే మార్చురీలో ఉంచేందుకు అవకాశం లేదని చెబుతుండడంతో ఇదే అదనుగా భావించి ఆసుపత్రి చుట్టూ ఆవహించి ఉన్న ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లు అవసరార్థుల నుండి వేలాది రూపాయలు వసులు చేస్తున్నారు.ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలను స్వగ్రామానికి పంపిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మహాప్రస్థానం సంస్థ ఈ సదుపాయాన్ని నీరుగారుస్తోంది. అంతేగాక గుంటూరు జిల్లా వరకే తమ వాహనాలను పరిమితం చేస్తామని చెప్పడం, ఇతర జిల్లాల వారికి ఇబ్బందికరంగా మారింది. తాజాగా నాలుగు నెలల పాటు వైద్య సేవలు పొందుతూ శనివారం మృతి చెందిన వెంకట సుబ్బయ్య మృతదేహాన్ని సొంతూరైన కడప జిల్లాలో చెన్నూరు మండలంలోని కొత్తూరుకు తీసుకెళ్లేందుకు మహాప్రస్థానం నిర్వాహకులు నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్‌ను సంప్రదించగా వారు రూ.25-30 వేలవుతుందని చెప్పడంతో మృతుని బంధువులు అంత ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ను సంప్రదించారు. ఆయన మహాప్రస్థానం సంస్థ జోనల్‌ మేనేజర్‌తో సంప్రదించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆసుపత్రికి చెందిన ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలించారు.

➡️