మెరకముడిదాం.. అభివృద్ధిలో ఆదర్శం

Dec 30,2023 21:14

ప్రజాశక్తి-మెరకముడిదాం  :  జిల్లాలోనే అభివృద్దిలో ఒక మోడల్‌ మండలంగా మెరకముడిదాం రూపొందుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీరు, విద్యాసంస్థలు, ఇతర కనీస వసతులన్నీ కల్పించడం ద్వారా ఈ మండలం జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సాతంవలసలో శనివారం పర్యటించారు. జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినప్పల నాయుడు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మితో కలసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో సాగునీటి సౌకర్యం ఒక్కటే మిగిలి వుందని, అందుకు కూడా తగిన ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. సాతంవలస లో రూ.60 లక్షలతో ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సాతంవలస నుంచి పెరుమాలి వరకు రూ.2కోట్ల ఎం.ఎన్‌.ఆర్‌.జి.ఎస్‌. నిధులతో 3.3కిలోమీటర్ల బిటి రోడ్డును, నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం భవనాలను మంత్రి ప్రారంభించారు. మండలంలో గతంలో అసైన్డ్‌ భూములు ప్రభుత్వం నుంచి పొందిన 722 మంది భూమిలేని నిరుపేదలకు 760 ఎకరాల భూమిపై శాశ్వత భూహక్కు పట్టాలు పంపిణీ చేశారు. సెర్ప్‌ – ఉన్నతి మహిళాశక్తి పథకంలో భాగంగా ముగ్గురు ఎస్‌.సి. మహిళలకు ఒక్కొక్కరికి రూ.3.03 లక్షల వ్యయంతో వడ్డీలేని రుణం కింద మంజూరు చేసిన ఆటోలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి గ్రామంలో పలు ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమకు ఫించను మంజూరు చేయాలంటూ మంత్రికి విన్నవించగా వారికి ఫించను మంజూరుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తదితరులు మాట్లాడారు. డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, చీపురుపల్లి ఆర్‌డిఒ బొడ్డేపల్లి శాంతి, పంచాయతీరాజ్‌ ఇఇ కెజిజెనాయుడు, డిఇ రమణమూర్తి, ఎంపిపి, జెడ్‌పిటిసి తదితరులు పాల్గొన్నారు.

➡️