మెరాయిస్తున్న సర్వర్‌

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : కులగణన సర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు చేయాల్సిన సర్వేను వాలంటీర్లు నిర్వహించడం పట్లఅనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యర్రగొండపాలెం మండలంలో 21 సచివాలయాల పరిధిలో 21,324 కుటుంబాల నుంచి 65,329 మందిని సర్వే చేయాల్సి ఉంది. అందుకు గాను 362 మంది వాలంటీర్లు, 140 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నాటికి ఈ సర్వేను ముగించాల్సి ఉంది. మొరాయిస్తున్న సర్వర్లు.. సర్వర్‌ సమస్య కారణంగా ఒక్కో ఇంటివద్ద 30 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. వాలంటీరు, కుటుంబ యాజమాని, సచివాలయ ఉద్యోగి ముగ్గురూ కలిసి రెండుసార్లు ఈకెవైసి (వేలిముద్రలు) వేస్తేనే ఆ కుటుంబం కులగణన పూర్తయినట్లు లెక్క. మధ్యలో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో మళ్ళీ మొదటికొస్తోంది. యాప్‌ ఉదయం 8 నుంచి 10 గంటల లోపు మాత్రమే బాగా పని చేస్తుందని, మిగిలిన సమయంలో మొరాయిస్తున్నట్లు సిబ్బంది వాపోతున్నారు.మ్యాపింగ్‌ సమస్య.. పట్టణాల్లో అద్దె ఇళ్లలో కాపురం ఉంటున్న వారు తరచుగా మారుతుంటారు. ఇలాంటి కుటుంబాలు ప్రతి సచివాలయం పరిధిలో 20 పైగా ఉంటున్నాయి. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో వాలంటీర్‌ దగ్గర మ్యాపింగ్‌ చేయించుకోవాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్తుల గురించి ఆరా..సెక్షన్‌-1లో వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత జీవన స్థితి, చిరునామా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తదితర ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. స్థిర, చరాస్తులతో పాటు కోళ్లు, పందులు, మేకలు, గొర్రెలు, పశువులు, లెక్క ఇలా 18 ప్రశ్నలకు యజమాని సమాధానం చెప్పాల్సి వస్తోంది. బియ్యం కార్డు సంఖ్య, ఇంటిరకం, పూరి గుడిసె, పెంకుటిల్లు, ఆర్‌సిసి బిల్డింగ్‌, డూప్లెక్స్‌ , మరుగుదొడ్లు సదుపాయం, తాగునీరు, గ్యాస్‌ తదితర వివరాలు అడుగుతున్నారు. సెక్షన్‌-2లో పుట్టిన తేదీ, వివాహస్థితి, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, వత్తి, పంట, భూమి, నివాస భూమి వివరాలు నమోదు చేయాల్సి ఉంది.క్రిస్టియన్లు అన్న సమాచారం లేదు.. బీసీ-సీ క్రిస్టియన్లు ఉన్నారు కులాల విభాగంలో దగ్గర క్రిస్టియన్లు అన్న సమాచారం లేదు. ఉపకులం క్రిస్టియన్‌ అన్న ఆప్షన్‌ లేకపోవడం సర్వే సమయంలో ఇబ్బందిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంపన్న వర్గాలకు బియ్యం కార్డులు లేవు. ఇలాంటి కుటుంబాలను ఎలా నమోదు చేయాలో తెలియక సర్వే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సర్వే సమయంలో ఏదైనా పొరపాటు ఉంటే వాటిని సవరించుకునేందుకు ఆప్షన్‌ ఇబ్బంది ఎదురవుతోంది. ఏమైనా ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తవుతున్నాయి. చాలా మంది యజమానులు సమాధానాలు చెప్పేందుకు సంకోచిస్తున్నారు. మరికొందరైతే కులాల వారీగా ఎన్నికల వేళ ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసుకునేందుకే కుల గణన సర్వే చేస్తున్నారని పేర్కొనడం గమనార్హం.

➡️