మెరుగైన ప్యాకేజీతో నిర్వాసితులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ముంపు గ్రామాల్లోని నిర్వాసితులను మెరుగైన ప్యాకేజీతో ఆదుకోవాలని, ఆ తరువాతే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి సోమయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిపిఎం కార్యకర్తల సమావేశం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో పి రూబెన్‌ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటివరకు పలు వాయిదాలు ముగిసినా నేటికీ నీరు మాత్రం ప్రాజెక్టు ద్వారా రాలేదన్నారు. ఎక్కడైనా నిర్వాసితులను ఆదుకున్న తరువాతనే ప్రాజెక్టులు ప్రారంభమవుతాయన్నారు. వెలిగొండ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిన కారణంగా ఎన్నికల వేళ హడావుడిగా ప్రారంభించేందుకు సిఎం జగన్‌ వస్తున్నారన్నారు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చిన తరువాతనే ప్రాజెక్టు ప్రారంభించాలనివ అన్నారు. సొరంగాల్లో లైనింగ్‌ పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు డికెఎం రఫి, జవ్వాజి రాజు, గుంటూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️