మేల్కొంటే కంపెనీలకు భారీ మూల్యమే

Mar 15,2024 22:39

సదస్సులో మాట్లాడుతున్న పల్నాడు జెసి శ్యాంప్రసాద్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘బాధ్యతాయుతమైన కృత్రిమ మేథస్సు’ అంశంపై పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎస్‌.పద్మశ్రీ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. జెసి మాట్లాడుతూ గతంలో వినియోగదారులు కొనుగోలు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారభద్రత, ఔషధ తనిఖీ, తూనికల కొలతల అధికారులతో వినియోగదారుల హక్కులను కాపాడుకునే సందర్భంలో తీసుకొనే చర్యలను వివరించారు. వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో సాధ్యమైనంత వరకు పంచుకోవద్దని, తద్వారా సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత పరిశీలించాకే కొనాలన్నారు. ఆన్లైన్‌ మార్కెటింగ్‌ గురించి అవగాహన పెంచుకొని తద్వారా వస్తు సేవలను పొందాలన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రచురిస్తున్న మేలుకొలుపు మాసపత్రిక గురించి ప్రస్తావించారు. వినియోగదారులకు ఉపయోగపడే విలువైన సమాచారం అందులో ఉంటుందన్నారు. గతంలో ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితి నుంచి ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అప్రమత్తంగా లేకుంటే మార్కెట్లో మోసపోతారని, వినియోగదారుడు తిరగబడితే సదరు కంపనీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వివరించారు. వినియోగదారులు ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు గానీ, ఒక సర్వీసును తీసుకునేందుకు ఒప్పుకున్నప్పుడుగానీ దానికి సంబంధించిన షరతులను ముందే తెలుసుకోవాలని, కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పదిలంగా ఉంచుకోవాలని సూచించారు. వేగంగా పెరుగున్న మార్కెట్‌ పోటీలో నిలదొక్కుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సుపై మాస్టర్‌ ట్రైనర్‌ బి.యం. సుభాని, మాస్టర్‌ బి.వి.ఏ.యల్‌ వరప్రసాద్‌ వివరించారు. కన్స్యూమర్‌ వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు పి.యజ్ఞనారాయణ, సిహెచ్‌.వెంకట కోటేశ్వరరావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ వరలక్షి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలక్ష్మి నారాయణ, అసిస్టెంట్‌ కంట్రోలర్‌, లీగల్‌ మెట్రాలజి అల్లూరయ్య, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

➡️