మొన్నటి వరకూ కష్టం.. ఇప్పుడు నష్టం..

ప్రజాశక్తి – యడ్లపాడు : పంటలు పండించడానికి, కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న కష్టం.. అదే పంటలు చేతికొస్తున్న తరుణంలో వాటిల్లుతున్న నష్టం.. అన్నీ పరిశీలించి వారిని పూర్తిస్థాయిలో అదుకోవాలని, అప్పుల బారి నుండి బయట పడేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో భారీ వర్షాలకు మండల కేంద్రమైన యడ్లపాడులో నీట మునిగిన పైర్లను ఆయన బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాపుకొచ్చిన మిర్చి పంట దెబ్బతిందని, మొక్కలకు ఉన్న కాయ మొత్తం తాలుగా మారే ప్రమాదముందని అన్నారు. రబీలో వేసిన శనగ, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ పంటలన్నింటినీ ఈ-క్రాప్‌లో నమోదు చేసి బాధిత రైతులను గుర్తించాలని కోరారు. ఈ-క్రాప్‌లో పంటలను నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం, అధికారులు అర్భాటంగా ప్రకటిస్తున్నా చాలా మంది పొలాలను ఇప్పటికీ నమోదు చేయలేదని క్షేత్రస్థాయిలో రైతులు చెబుతున్నారని తెలిపారు. రియలెస్టేట్‌ ప్లాట్లతో వాగులను మళ్లించడం, రోడ్లు వేయడంతో నీరు పోయే మార్గం లేక పొలాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ప్రభుత్వం మిర్చి ఎకరాకు రూ.6800 చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తోందని, అయితే అది విత్తనాల ఖర్చుకైనా సదిపోదని అన్నారు. సాగు ఖర్చులకు అనుగుణంగా దీన్ని పెంచాలని, మిర్చికి రూ.50 వేలు, మిగిలిన పంటలకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉన్న పంటలను రక్షించు కోవడానికి అవసరమైన సూచనలను రైతులకు వ్యవసాయ అధికారులు తెలపాలని, అవసరమైన మందులను రైతుభరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఈ-క్రాప్‌ నమోదు చేసిన పంటలకు, వేలిముద్ర వేయని రైతులకు వేయడానికి అవకాశం కల్పించాలన్నారు. మొన్నటి వరకూ నీటి ఎద్దడి నుండి పంటలను రక్షించు కోవడానికి నానా అగచాట్లు పడిన రైతులు ఇప్పుడు పంట చేతికొచ్చే తరుణంలో నీట మునిగిన పంటను కాపాడుకోవడానికి అవస్థ పడుతున్నారని, ఈ కష్టాలన్నింటినీ ప్రభుత్వం గుర్తించి దిగుబడుల ఆధారంగా బీమాను అమలు చేయాలని కోరారు.

ఏకమైన వాగులు.. దెబ్బతిన్న పంటలు..
మండలంలోని ప్రధాన వాగులైన ఉప్పవాగు, నక్క వాగు తుపాను నేపథ్యంలో పొంగిపొర్లాయి. రెండు వాగుల కలయికతో తిమ్మాపురం, దింతెనపాడు, జాలాది, గణేశునివారిపాలెం, తుర్లపాడు గ్రామాల్లో పలు పంటలు నీట మునిగాయి. ఇదిలా ఉండగా పలు గ్రామాల్లో విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి, ఆరు గ్రామాల్లో ట్రాన్స్‌ఫారాలు దెబ్బతిన్నాయి. ఉన్నవలో నాలుగు విద్యుత్‌ స్తంభాలు పడిపోగా యడ్లపాడులో ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. వంకాయలపాడు పీటర్‌ వద్ద యుకలిఫ్టస్‌ చెట్లు విద్యుత్‌ తీగలపై వాలాయి. బోయపాలెం నుంచి సంఘం గోపాలపురం వెళ్లే మార్గంలో భారీ చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడ్డాయి. విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిలినట్టు ఏఈ సాంబశివరావు తెలిపారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో పనరుద్ధరణకు 14 మంది సిబ్బంది పనులు చేస్తున్నారు.

నీరు పోవడానికి పొక్లెయిన్‌
ప్రజాశక్తి – అచ్చంపేట : మిచౌంగ్‌ తుపాను మిర్చి రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి మండలంలో మిర్చి కాయలున్న మొక్కలన్నీ నేలకొరిగాయి. సుమారు 2 వేల ఎకరాలకు పైగా మిరప పంట నేలకొరిగినట్లు తెలిసింది. మండల పరిధిలోని సండ్రతండాకు చెందిన లోక నాయక్‌ అనే కౌలురైతు మాట్లాడుతూ తాను సాగుచేసిన ఆరెకరాల పంట నీట మునిగిందని, తాను ఏడెకరాలు కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.45 వేల చొప్పున కౌలు చెల్లించి సుమారు రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టానని, ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఉపద్రవం వచ్చిందని వాపోయారు. తన పొలానికి మూడు వైపులా రహదారి ఉండటంతో ఎగువ పొలాల నుండి వచ్చే నీరంతా తన పొలంలోనే నిలిచి పంట మునిగిపోయిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న పొలం సాగవకపోవడంతో ఆ రైతును బతిమాలి పొక్లెయిన్‌తో రహదారిని పగలగొట్టి తన పొలంలోని నీటిని బయటకు పంపినట్లు వివరించారు. పొలంలో నీరింకా ఉందని, మొత్తం బయటకు వెళ్తే మినహా పడిపో యిన మొక్కలను లేపలేమని బాధిత కౌలు రైతు చెబుతున్నారు. నీట మునిగిన కాయ లన్నీ తాలు కాయలుగా మారే ప్రమాద ముందని ఆవేదనకు గురవుతున్నారు.

ప్రజాశక్తి – అమరావతి : వాగులు వంకలు కలసి పంట పొలాలపై ప్రవహించి పంటను పూర్తిగా దెబ్బతీసాయని టిడిపి రైతు విభాగం నాయకులు కె.వసంతరావు అన్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను ఆయన బుధవారం పరిశీలించారు. ఎండ్రాయి, నరుకుళ్లపాడు, ఉంగుటూరు, ఊటుకూరు, బయ్యవరం ప్రాంతాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, పత్తి పొలాల్లో ఒక్కో ఎకరంలో ఐదారు క్వింటాళ్ల పత్తి తీతకు సిద్ధంగా ఉన్న సమయంలో తుపాను పంటను నీట ముంచిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు నీట మునిగాయన్నారు. బాధిత రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాశక్తి-నకరికల్లు : తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి జి.పిచ్చారావు డిమాండ్‌ చేశారు. చేజర్లలోని దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, అరటి, మిర్చి పొలాలను ఆయన బుధవారం పరిశీలించారు. మండలంలో ఎక్కువగా కౌలురైతులున్నారని, నష్టపరిహారాన్ని వారికే దక్కేలా చూడాలని కోరారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : తుపాను బాధిత మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని కంకణాలపల్లిలో మిర్చి పొలాలను సంఘం నాయకులు పరిశీలించారు. మహేష్‌ మాట్లాడుతూ పంట చేతికొచ్చే ప్రతిసారి ప్రకృతి కన్నెర్ర చేయటంతో రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వెంటనే పంట నష్టం అంచనా వేయాలని కోరారు. పరిశీలనలో కౌలు రైతులు ఎం.వెంకటేశ్వరరావు, పి.వెంకటరావు, నరేష్‌ పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ఈపూరు : తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, శనగ పంటలను మండల వ్యవసాయాధికారి ఆర్‌.రామారావు బుధవారం పరిశీలించారు. వనికుంటలో నీటి మునిగిన శనగ పైరును తహసిల్దార్‌ ఏవీ సుధాకర్‌ పరిశీలించారు. దెబ్బతిన్న పంటలపై నష్ట అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏవో తెలిపారు.

➡️