మోకాళ్లపై కూర్చొని కార్మికుల నిరసన

Dec 27,2023 21:47
ఫొటో : మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలియజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలియజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
మోకాళ్లపై కూర్చొని కార్మికుల నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆ సంఘం గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఎన్నోసార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినప్పటికీ కాలయాపన చేశారే తప్ప సమస్యలు పరిష్కరించలేదన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హామీనిచ్చారని, ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. పైపెచ్చు పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కరోనాలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనులు చేసిన కార్మికులకు వేతనాలు పెంచడం పర్మినెంట్‌ చేయడం న్యాయమైనదేనని, ప్రభుత్వం వారిని పేర్మినెంట్‌ చేయకపోగా కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా డైలీ కార్మికుల పేరుతో నెలకు రూ.8వేలు, రూ.9వేలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. ఈ జీతాలతో కుటుంబాలు ఎలా గడుస్తాయని పెరిగిన ధరలతో కొని తినలేని పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారని ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కార్మికులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారని రిటైర్డ్‌ అయిన వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపిస్తున్నారని, వారికి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం అందించకుండా వారు ఎలా బతకాలని ఇదేనా ప్రభుత్వ పాలనా అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీని ఇతర డిమాండ్లను వెంటనే అమలు చేసి పరిష్కరించాలని పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తురక సీనయ్య బిడదల మహేష్‌, కే బాబు క్రాంతి, ఒంగోలు రమేషు, మహిళా నాయకులు పల్లెపాటి అనిత, లేటి రాజ్యలక్ష్మి, వెంకట లక్ష్మీకాంతమ్మ, నారాయణమ్మ, కార్మికులు పాల్గొన్నారు.

➡️