మోకాళ్లపై నిల్చొని నిరసన

Dec 24,2023 23:45
ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

ప్రజాశక్తి – కాకినాడ

ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. వారు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జెఎసి అధ్యక్షులు ఎం.చంటిబాబు, జిల్లా కార్యదర్శి ఎ.సత్యనాగమణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అమ్మఒడి, విద్యాదీవెన, నాడు నేడు వంటి పథకాలను విజయవంతం చేయడంలో సమగ్రశిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు. జగన్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో అమలు చేసే ప్రతి పథకాన్ని దగ్గరుండి విజయవంతం చేస్తున్న ఉద్యోగులను తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని, జీతాలు పెంచమనే సరికి రోడ్డున పడేయడం దారుణమన్నారు. తక్షణం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లుగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం సమ్మె శిబిరానికి యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు నగేష్‌, చక్రవర్తి, ఎస్‌.గోవింద రాజులు, డి.కనకదుర్గా, కె.వి.వి నాగేశ్వరరావు, సామర్లకోట ఎంఇఒ శివరామకృష్ణ, పెద్దాపురం ఎంఇఒ చౌదరి, జె.రమణ, ఎంఇఒ -1 బి.కృష్ణవేణి, ఎంఇఒ 2 పి.సత్యన్నారాయణ, బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు బొజ్జా శరత్‌, ఎపి స్కూల్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకులు చలపతి మద్దతు తెలిపి ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఎ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్‌, రాధాకృష్ణ పాల్గొన్నారు.

➡️