మోగిన ఎన్నికల నగారా

Mar 16,2024 21:55

ప్రజాశక్తి – పార్వతీపురం :  సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. దేశంలో 4 విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోను, జిల్లాలోను ఎన్నికలు జరుగ నున్నాయి. ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల గడువు ఏప్రిల్‌ 25 కాగా, 26న పరిశీలన ఉంటుంది. 29 వరకు ఉపసంహ రణకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్‌ జరుగ నుండగా, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నికల నిర్వహణ పనిలో నిమగమైంది. ఓట్ల జాబితా మొదలుకుని, పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు, బూత్‌లు, అక్కడ సదుపాయాల కల్పన, పోలింగ్‌ సిబ్బందికి అవగాహన కల్పించడం నామినేషన్లను దాఖలు చేసే విధానం, సువిధ యాప్‌ ద్వారా ధరఖాస్తు చేసే విధానం తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఇఆర్‌ఒలకు, నోడల్‌ అధికారులకు శిక్షణ వంటి ప్రక్రియ సుమారు మూడు నెలలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి శనివారం 3గంటల నుంచే అమల్లోకి వచ్చింది. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు, డేటా సమకూర్చడం వంటి పనులు జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) నేతృత్వంలో అధికారులు మరింత ముమ్మరం చేశారు. అధికారిక సమాచారం ప్రకారం… జిల్లాలో మార్చి 5వ తేదీ వరకు 15,41,001 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు, వీరిలో 3,87,764మంది పురుషులు, 3.96,766 మంది మహిళలు, 68 మంది థర్డ్‌ జెండర్‌ ఉన్నారు. వీరంతా తమ ఓట్లను వినియోగించుకునేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1031 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 6 పోలింగ్‌ కేంద్రాలను మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లుగా రూపొందించారు. ఎన్నికల సంఘం విధి విధానాల ప్రకారం పోలింగ్‌ స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లకు ఎండ నుంచి రక్షణ కోసం షామియానా, సహాయం చేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్‌ బృందాలు నియామకం, వాహనాలు, పోస్టల్‌ బ్యాలెట్లు సమకూర్చడం, ఇవిఎంల తరలింపు, మోడల్‌ కోడ్‌ అమలు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, రిసెప్షన్‌ సెంటర్‌, పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించే సదుపాయాలు, వ్యయ నియంత్రణ తదితర అంశాలపై ఇప్పటికీ అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. పోలింగ్‌ ప్రక్రియ మొదలవ్వడానికి 90 నిమిషాల ముందే మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా హోం ఓటింగ్‌ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ ప్రవేశ పెట్టింది. దీనికోసం ఓటర్లు ముందుగానే ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 85 ఏళ్ల వయసు పైబడినవారు, 45 శాతం వికలాంగత్వం ఉన్న వారు, కోవిడ్‌ బాధితులు తమ ఇళ్ల వద్దే ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఫిర్యాదుల కోసం 24 గంటలూ పనిచేసే కంప్లయింట్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అమల్లోకి ఎన్నికల నియమావళిప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల నోడల్‌ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల నియమావళి అమలు అధికారులు తక్షణం చర్యలు తీసుకుని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. జూన్‌ 6 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని వివరించారు.అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా స్పందన రద్దుఎన్నికల కోడ్‌ వచ్చిన దృష్ట్యా స్పందన కార్యక్రమం సోమవారం ఉండదని ఇన్‌ ఛార్జ్‌ జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని, కావున తదుపరి ఉత్తర్వుల వరకు స్పందన కార్యక్రమం ఉండదని అన్నారు. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు.

➡️