రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

Mar 4,2024 21:32

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమం (ప్రాజెక్టు ఫర్‌ రిడక్షన్‌ ఆఫ్‌ ఇన్ఫాంట్‌ మోర్టాలిటి రేట్‌ బిలో 10)పై వైద్య అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు నివారణకు ముఖ్యంగా రక్త హీనత నివారణపై దృష్టి సారించాలన్నారు. తల్లి గర్భం నుండే పర్యవేక్షణ ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటా అవగాహన ఉండాలని, స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ సమావేశాల్లో విధిగా చర్చించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, రక్త హీనత కలిగిన వారు, బరువు తక్కువ, వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం తదితర కేసులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం వారే తినేలా పర్యవేక్షణ చేస్తామని తీర్మానించాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయం పరిధిలో రక్త హీనత ఉన్న వారిని గుర్తించి దత్తత అధికారిని నియమించాలని చెప్పారు. మండల స్థాయిలో ఎంపిడిఒ, వైద్యాధికారి సంయుక్తంగా బాధ్యత వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ ఎం, ఆశా, మహిళా పోలీస్‌ ఇంటింటా పర్యటించి రక్త హీనత కలిగిన వారిని గుర్తించాలని సూచించారు. హీమోగ్లోబిన్‌ పరీక్షలు ఎనీమియా మానిటరింగ్‌ టూల్‌ యాప్‌ ద్వారా చేయాలని స్పష్టం చేశారు. 5,6 తేదీల్లో అన్ని గ్రామాల్లో సమన్వయ సమావేశం జరగాలని ఆదేశించారు. ప్రతి కేసును హై రిస్క్‌ కేసుగా పరిగణించి సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేశారు. పిల్లలకు శత శాతం టీకాలు వేయించాలన్నారు. టెలీ మెడిసిన్‌, కిల్కారి యాప్‌ సేవలు ఉపయోగిం చుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు గల అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథ రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఎం.వినోద్‌, పాచిపెంట ఎంపిడిఒ ఎం.లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️