రసాభాసగా మండల సమావేశంప్రజాశక్తి-ఒంటిమిట్ట

ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు వాగ్వివాదానికి దిగి మండల సమావేశాన్ని పక్కదారి పట్టించారు. గందరగోళం నేపథ్యంలో అధికారులు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. చివరకు సర్పంచ్‌లు ఎంపిడిఒ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలియజేశారు. సమావేశానికి హాజరు కావాల్సిన ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి హరితా హోటల్‌లో ఉంటూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. వివరాలు.. మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇన్‌ఛార్జి ఎంపిపి గడ్డం జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిడిఒ సోమవారం ప్రారంభించారు. ముందుగా వైసిపి చెందిన గొల్లపల్లి, గంగపేరూరు సర్పంచులు లక్ష్మినారాయణరెడ్డి, ఓబుల్‌రెడ్డి, శివనారాయణ, మరికొంత మంది సర్పంచులు మాట్లాడుతూ గత సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన సమస్యలు ఒక్కటీ పరిష్కారం కాలేదని అలాంటప్పుడు సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. అందుకు ఇన్‌ఛార్జి ఎంపిపి స్పందిస్తూ కొద్ది సేపు మౌనంగా కూర్చోవాలని పలుమార్లు సర్ధిజెప్పే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన సర్పంచులు సమావేశంలో సమస్యల గురించి అడిగే హక్కు తమకు ఉందని, అసలు మీరు ఎంపిపి కాదు’ అని చెప్పారు. ఇన్‌ఛార్జిఎంపిపి, ఎంపిడిఒ వారిని గట్టిగా వారించి సభకు అంతరాయం కల్గించొద్దని, అలా చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారం సభాధ్యక్షులపై ఉంటుందని, ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. సర్పంచులు కూడా సమావేశాన్ని బహిష్కరించి ఎంపిడిఒ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలియజేశారు. సమావేశానికి హాజరు కావాల్సిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి హరిత హోటల్‌లో ఉన్నట్లు తెలిసింది. విషయంతా ఆయనకు తెలిసిినా ఇన్‌ఛార్జి ఎంపిపి, సర్పంచులు అధికార పార్టీకి చెందిన వారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు సమావేశాన్ని పక్కదారి పట్టించి సమయం వృథా చేయడంపై పలువురు విమర్శిస్తున్నారు. సమావేశంలో గిడ్డంగుల శాఖ డైరెక్టర్‌ ఆకేపాటి వేణుగోపాల్‌రెఇ్డ, సర్పంచులు , ఎంపిటిసి నారాయణరెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️