రసాయనిక విపత్తుపై మాక్‌ డ్రిల్‌

Mar 7,2024 20:52

ప్రజాశక్తి – పూసపాటిరేగ : జిల్లాలోని పారిశ్రామిక వాడగా పిలువబడుతున్న పూసపాటిరేగ మండలంలో బుధవారం రసాయినిక విపత్తుపై జిల్లా అధికార బృందం మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఈ డ్రిల్‌లో 24 డిపార్ట్‌మెంటులు పాల్గొన్నాయి. మాక్‌ డ్రిల్‌ ఇలా ప్రారంభమైంది… ఉదయం 9:51 నిమిషాలకు మైలాన్‌ కెమికల్‌ పరిశ్రమ నుండి ప్రమాదం సూచించే అలారం మోగింది. పరిశ్రమలో అన్‌ లోడ్‌చేస్తున్న లారీ ట్యాంక్‌ర్‌ లీక్‌ వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో లారీ ట్యాంక్‌రతో సహా పదిమంది వరకూ వర్కర్స్‌ గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో విజయనగరం తిరుమల ఆసు పత్రికి తరలించారు. ట్యాంకర్‌ నుండి మంట లు బారీగా వ్యాపించడంతో పక్కనే ఉన్న ఆమోనియం సిలెండర్‌ రబ్బర్‌కేప్‌ కరిగిపోయి అమోనియం గ్యాస్‌ లీకైంది. దీంతో అమోనియం గ్యాస్‌ పీల్చిన కొంత మంది అక్కడకక్కడే పడిపోయారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో పూసపాటిరేగ, సుందరపేట పిహెచ్‌సిలకు తరలించారు. అమోనియం గ్యాస్‌ గ్రీన్‌ జోన్‌లోకి రావడంతో సుమారుగా మరో 40 మంది దాకా అమోనియం గ్యాస్‌ పీల్చి స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. వారం దరిని సమీపంలోని చోడమ్మ అగ్రహారంలో ఏర్పాటు చేసిన రీహెబిటేషన్‌ కేంద్రానికి తరలించారు. పూసపాటిరేగ పిహెచ్‌సిలో వైద్యులు రాజేష్‌ వర్మ క్షతగాత్రులకు చికిత్సలు చేశారు. క్షేమంగా ఉండడంతో వారిని ఇళ్లకు పంపించారు. ఈ సందర్బంగా ఆర్‌డిఒ మాట్లా డుతూ రాష్ట్రం మొత్తం గురువారం రసాయనిక విపత్తుపై మాక్‌ డ్రిల్‌ జరుగుతోందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో సాదారణంగా ఇలాంటి విపత్తులు వస్తే ఎలా వారిని రక్షించుకోగలమన్నదానిపై మాక్‌ డ్రిల్‌ చేసామన్నారు. అన్ని డిపార్ట్‌మెంటులు కలసి చేసామని ఈ డ్రిల్‌ వల్ల అధికార్లుతో పాటు, కార్మికులకు, యాజమాన్యాలకు అవగాహన వస్తుందని చెప్పారు. ఈ మాక్‌ డ్రిల్‌లో జిల్లా ఇన్స్‌పెక్టర్స్‌ ఆప్‌ ప్యాక్టరీ జివివిఎస్‌ నారాయణ, జిల్లా పైర్‌ అధికారి రామ్‌ ప్రకాశ్‌, డిఎంఅండ్‌హెచ్‌ఒ బాస్కరావు, తహశీల్దార్‌ ప్రవళిక, ఎస్‌ఐ సన్యాసినాయుడు, ఇఒపిఆర్‌డి డి. శ్రీనువాసరావు మైలాన్‌ ప్లాంట్‌ హెడ్‌ గురవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️