రాజధానిలో మోహరించిన పోలీసులు

Feb 5,2024 23:10

సిఎం వస్తున్నారనే సమాచారంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై వాహనాలను నిలిపివేసిన పోలీసులు
ప్రజాశక్తి – తుళ్లూరు :
సోమవారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. సుమారు మూడువేల మంది పోలీసులతో అసెంబ్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీకి దారితీసే ప్రధాన మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనదారులను, రోడ్డుపై వెళుతున్న వారిని సైతం తనిఖీలు చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, వెంకటపాలెం రైతు దీక్షా శిబిరాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రైతులు, మహిళల కదలికలపై నిఘా ఉంచారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కాన్వారు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి మందడం పంచాయతీ కార్యాలయం మీదుగా సచివాలయానికి చేరుకుంది. దీంతో ఆ మార్గంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేస్తారనే ఉద్దేశంలో మందడం రైతు దీక్షా శిబిరం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో పహారా కాశారు. దీక్షా శిబిరం నుంచి రోడ్డు పైకి ఎవరూ రావడానికి వీలు లేదని హెచ్చరించారు. అయినా రైతులు, మహిళలు ఖాతరు చేయలేదు. ముఖ్యమంత్రి దీక్షా శిబిరం వద్దకు వచ్చే సమయంలో రైతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై తాళ్లను అడ్డుగా పెట్టి వారిని నిలువరించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పొలీసు బలగాలతో అణచివేయాలని చూస్తోందని రైతులు,మహిళలు విమర్శించారు.

➡️