రాజధాని ఫైల్స్‌ సినిమాతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు: ఎరిక్షన్‌బాబు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాజధాని ఫైల్స్‌ సినిమాతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని, ఒక సినిమాకు ముఖ్యమంత్రి భయపడడం చరిత్రలో ఇదే తొలిసారని టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రైతుల బతుకు చిత్రంపై తీసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్‌ ప్రభుత్వం దిగజారిందన్నారు. సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్‌ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటి? ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో వైసీపీ కోర్టుకు వెళ్లిందని తెలిపారు. 34 వేల మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపంగా నిలిచింది రాజధాని ఫైల్స్‌ సినిమా అన్నారు. వేల మంది రైతుల త్యాగాలను బూడిదలో పోసిన పన్నీరు చేశాడని అభివర్ణించారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని ఛిద్రం చేసిన తుగ్లక్‌గా అభివర్ణించారు. మూడు రాజధానుల పేరుతో ఆంధ్రులను మోసం చేశాడని పేర్కొన్నారు. ప్రాంతాల పేరుతో ప్రజలను విడగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూశాడని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చాడన్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న మైలేజ్‌ను చూసి ఓర్వలేక సైకో చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, కామేపల్లి వెంకటేశ్వర్లు, చిట్టేల వెంగళరెడ్డి, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, కొత్త భాస్కర్‌, చెవుల అంజయ్య, మంత్రూ నాయక్‌, మహేష్‌ నాయుడు, షేక్‌ మస్తాన్‌వలి, షేక్‌ జిలాని, వెంగయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️