రాజీయే రాజ మార్గం

Mar 16,2024 22:04

  ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌  : రాజీయే రాజ మార్గమని, వివిధ తగాదాలలో వ్యక్తుల మధ్య రాజీ కుదిర్చి ఇరు పార్టీలకు సమ న్యాయం చేయడం లోక్‌ అదాలత్‌ ధ్యేయమనింగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ జాతీయ లోక్‌ అదాలత్‌ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను కాపాడు కోవాలాలని సూచించారు. లేనిపోని తగాదాలకు పోయి పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగరాదని, కోర్టు లలో కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అనవసర కలహాలుమాని పిల్లల భవిష్యత్‌ కోసం, మనమీద ఆధార పడ్డవారికోసం అహం వీడి రాజీకి రావాలని హితవు పలికారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. విజయనగరంలో 757, పార్వతీపురంలో 56, బొబ్బిలి 137, సాలూరు 76, శృంగవరపుకోట 52, గజపతినగరం 34, చీపురుపల్లి 31, కొత్తవలస 63, కురుపాం 14 కేసులు మొత్తంగా 1220 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. అదాలత్‌లో అధికంగా 129 మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రూ.2కోట్ల 43లక్షల 57వేల 61 రూపాయల మొత్తాన్ని కక్షి దారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదాలత్‌లో న్యాయమూర్తులు జి.రజని, ఎం.మీనాదేవి, సికెందర్‌ భాషా, ఎన్‌.పద్మావతి, కె.నాగమణి, వి.లక్ష్మికుమారి, బి.రమ్య, కె. మోహిడెన్‌ జమూరుత్‌ బేగం, జె. సౌమ్య జోసిఫిన్‌ , బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సిహెచ్‌ దామోదర రామ్మోహనరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. కక్షిదారులకు సౌకర్యార్థం మెడికల్‌ క్యాంపు, భోజనాలు ఏర్పాటు చేశారు.

➡️