రాష్ట్రంలో గాడి తప్పిన పాలన

Mar 20,2024 21:33

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, మళ్లీ సుపరిపాలన అందించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం అన్నమరాజువలస పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం, పసుపు వానివలస, అంటివలస, రెయ్యివానివలస గ్రామాల్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక, అసాంఘిక, అసమర్థ పరిపాలన సాగుతోందన్నారు. ఇటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ప్రజలందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గ్రామాల్లో సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్‌, వెంకటరమణ, తిరుపతిరావు, మరిపి సింహాచలం, లక్ష్మణదొర, లక్ష్మణరావు, రామన్నదొర, అన్నపూర్ణ, కృష్ణ పాల్గొన్నారు.

➡️