రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అడ్డగింత

Jan 25,2024 20:44

 ప్రజాశక్తి-బొబ్బిలి  :  జ్యూట్‌మిల్లు స్థలంలోకి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెళ్లకుండా గురువారం జ్యూట్‌ కార్మికులు అడ్డుకున్నారు. శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు స్థలాన్ని విక్రయించింది. జ్యూట్‌ కార్మికులకు పిఎఫ్‌ బకాయిలు చెల్లించకపోవడంతో అర్హత ఉన్న కార్మికులకు పింఛను రావడం లేదు. దీంతో పిఎఫ్‌ బకాయిలు చెల్లించాలని కార్మికులు పలు దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ యాజమా న్యం పట్టించుకోలేదు. జ్యూట్‌ మిల్లు స్థలంలోకి వెళ్లేందుకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రయత్నించగా, ఆదర్శ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు అడ్డుకున్నారు. మళ్లీ గురువారం జ్యూట్‌ మిల్లు స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆదర్శ కార్మిక సంఘం నాయకులు వి.శేషగిరిరావు, పి.కృష్ణ, జి.రామా రావు, కార్మికులు అడ్డుకున్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించే వరకు స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పగా, ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసు కుంది. కార్మికులు పట్టువీడకుండా ఉండడంతో వ్యాపారులు వెనుదిరిగారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

➡️