రూ.3వేల పింఛన్‌ అందజేత

Jan 3,2024 21:41
ఫొటో : పింఛన్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : పింఛన్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
రూ.3వేల పింఛన్‌ అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి పేదవాడికి అందచేస్తున్న సామాజిక పింఛన నగదు పెంచి అందజేస్తుండడంతో ప్రతిఇంటా ముందస్తు సంక్రాంతి పండుగ వచ్చిందని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో బుధవారం వైఎస్‌ఆర్‌ పింఛను కానుక రూ.3వేలు పెంపు ఉత్సవాల్లో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తొలుత స్త్రీ విద్య, అభ్యున్నతి కోసం కృషి చేసిన సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన ప్రతీఒక్క హామీని నెరవేర్చారని, అందులో భాగంగా పింఛన్‌ నగదును పెంచుకుంటూ పోతూ జనవరి నుండి రూ.3వేలు పింఛను అందజేస్తున్నారని, సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ మరింత ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం ప్రతినెలా 1న వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛను అందజేస్తారని తెలిపారు. జిల్లాలో ఒక్క నెలలోనే 4408 పింఛన్లు మంజూరు కాగా అందులో మండలంలో 84నూతన పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. అర్హతే ప్రమాణికంగా పింఛను అందచేసే విధానం, ఇంటివద్ద అందజేసే పద్ధతి, ప్రభుత్వం అందజేసిన ప్రతీ రూపాయి నేరుగా వారి ఖాతాల్లోకే చేరే పద్ధతులను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదని, మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలను నెరవేర్చారన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత సంక్షేమ ప్రభుత్వానికి తేడాను ప్రజలే గమనించాలని, రానున్న మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నందున ప్రతిఒక్కరూ ఆలోచించి తమకు ఏ ప్రభుత్వం సంక్షేమ పాలన అందించిందో ఆలోచించి వారిని కొనసాగించాలని కోరారు. తమ కుటుంబం 40యేళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉందని, తన తండ్రి పార్లమెంట్‌ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, డిగ్రీ కళాశాల ఏర్పాటు, జవహర్‌ నవోదయ విద్యాలయం కోసం సొంత స్థలాన్ని అందజేశారని, జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదివిన వారిలో ఎంతో మంది ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు డాక్టర్లు అయ్యారన్నారు. అప్పట్లో రోడ్ల వసతి సక్రమంగా లేని ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేశారని, అభివద్ధి, సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న బద్వేల్‌ వద్ద ఏర్పాటు చేసిన సించూరి ప్లైవుడ్‌ పార్కు వల్ల నియోజకవర్గ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ పరిశ్రమకు జామాయిల్‌ ఎంతో అవసరపడుతుందని, మన ప్రాంత రైతులు ఈ పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులను ప్రోత్సహించే విధంగా అవసరమైన చర్యలు తసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, జిల్లా ఐటి వింగ్‌ అధ్యక్షులు కొప్పోలు వెంకటేశ్వర్లు, జిల్లా రైతు విభాగం సెక్రటరీ రవీంద్రబాబు, మండల బూత్‌ లెవెల్‌ మేనేజర్‌ గోపాల్‌ రెడ్డి, సర్పంచ్లు గాలిబోయిన రామ్మోహన్‌, కృష్ణారెడ్డి, ఎంపిడిఒ నాగమణి, గ్రంథాలయ బాంఢాగారి నారాయణరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️