రూ.35 లక్షల స్వాహాపై డ్వాక్రా మహిళల ఆందోళన

ప్రజాశక్తి-నాగులుప్పపాడు : రుణాల స్వాహాపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ మండల పరిధిలోని ఒమ్మెవరం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు ఉప్పుగుండూరులోని యూనియన్‌ బ్యాంకు ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. విఒఎ కోటా అనిత రూ.35 లక్షల రుణాలను స్వాహా చేసిందని ఈ విషయంపై విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. తొలుత వారు ఒంగోలు వెళ్లి ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, డిఆర్‌డిఎ పీడీకి ఫిర్యాదు చేశారు.అనంతరం యూనియన్‌ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ తమకు తెలియకుండా స్త్రీనిధి, పొదుపు డబ్బులు గ్రామ సమైఖ్య సంఘానికి మల్లించినట్లు తెలిపారు. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్‌ ,పీల్డ్‌ ఆఫీసర్‌, ఎపిఎం , సిసిల పాత్ర ఉన్నట్లు వారు ఆరోపించారు. తాము దాచుకున్న పొదుపు డబ్బులను తమ ప్రమేయంలేకుండా గ్రామ సమైఖ్య సంఘానికి మళ్లించడం ఏమిటని వారు బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నించారు. తమ ఖాతాల్లోని నగదు స్వాహా అయినట్లు వారు తెలిపారు. శ్రీలత అనే మహిళ రూ. 5.25లక్షలు రుణం తీసుకున్నట్లు ఉందన్నారు. ఇలాగే పలువురు రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందన్నారు. శ్రీనిధి నుంచి తాము రుణాలు తీసుకోలేదని తెలిపారు. విఒఎ చేతి వాటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. డ్వాక్రా మహిళల ఆందోళన గురించి తెలుసుకున్న శ్రీనిధి ఎజిఎం హర్షవర్ధన్‌ డిఆర్‌డిఎ అసిస్టెంట్‌ అధికారి వరప్రసాదు బ్యాంకు వద్దకు చేరుకొని మేనేజర్‌ను విచారించారు. ఎవరి ఖాతాను నుంచి ఎంత స్వాహా అయ్యిందో లిఖిత పూర్వంగా ఇవ్వాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నగదు స్వాహా చేసిన నిందితులను గుర్తిస్తామని వారు తెలిపారు.

➡️