రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

Mar 19,2024 21:49

ప్రజాశక్తి-విజయనగరం  : జిల్లాలో జరిగే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. నగరంలోని జెఎన్‌టియు – గురజాడ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోనూ, జొన్నాడలోని లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలోను ఓట్లలెక్కింపు చేపట్టాలని నిర్ణయించామని, ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాట్ల కోసం పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్‌పి ఎం.దీపిక, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, రెవిన్యూ, పోలీసు అధికారులతో కలసి మంగళవారం ఓట్లలెక్కింపు కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా వారితో చర్చించిన మీదట సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూముల ఏర్పాటు, ఓట్లలెక్కింపు జెఎన్‌టియు, లెండి కళాశాలల్లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ సందర్భంగా జెఎన్‌టియులో విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు, లెండి కళాశాలలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గాల ఇవిఎంల స్ట్రాంగ్‌రూంలు, ఓట్లలెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశించారు. ఆయా క్యాంపస్‌లలో అవసరమైన భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, సి.సి.కెమెరాల ఏర్పాటు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి వసతుల కల్పన తదితర అంశాలపై సూచనలు చేశారు. పర్యటనలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, ఆర్‌డిఒలు ఎం.వి.సూర్యకళ, సాయిశ్రీ, బి.శాంతి, రిటర్నింగ్‌ అధికారులు నూకరాజు, జోసెఫ్‌, మురళీకృష్ణ, డిఎస్‌పి. గోవిందరావు, విజయనగరం తహశీల్దార్‌ రత్నం, పోలీసు అధికారులు, పలు మండలాల తహశీల్దార్‌లు పాల్గొన్నారు.

15వేల పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు

సినిమా థియేటర్లు, టివి ఛానళ్లు, కేబుల్‌ టివీల్లో రాజకీయ పార్టీలు జారీ చేసే ప్రచార ప్రకటనలకు ఎంసిఎంసి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఇంతకుముందే మొదలై, కొనసాగుతున్న ప్రకటనలకు సైతం తాజాగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 14,540 పోస్టర్లు, ఫెక్సీలు, బ్యానర్లను, 38 హోర్డింగులను తొలగించినట్లు తెలిపారు. 314 విగ్రహాలకు ముసుగులు వేశామని తెలిపారు. సి-విజిల్‌ ద్వారా గానీ, కాల్‌సెంటర్‌ లేదా ఇతరత్రా వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను విచారణ పేరుతో రోజుల తరబడి వేచి చూడకుండా, గంటల్లోనే వాటిపై చర్యలు తీసుకొని, నివేదికలను తమకు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు.ద్యం బాటిళ్లు పట్టివేత ఎన్నికల తనిఖీల్లో భాగంగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని పట్టుకున్నారు. భోగాపురం మండలం గూడెపువలస వద్ద అక్రమంగా తరలిస్తున్న 104 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కొండెపు రామినాయుడి పై కేసు నమోదు చేశారు.

➡️