రైతుభరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల

Feb 28,2024 23:51

గుంటూరులో మెగా చెక్కు అందచేస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
అధిక పంట ఉత్పాదకత కోసం, నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు చేయటానికి, సాగుదారులకు మద్దతిచ్చే లక్ష్యంతో రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌.శివశంకర్‌ అన్నారు. ఈ ఏడాదికి మూడో విడతగా రైతు భరోసా-పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రైతుల ఖాతాలకు బటన్‌ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని బుధవారం సిఎం క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని గుంటూరు కలక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్రకుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం పాల్గొని వీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 సంవత్సరంలో మూడవ విడత కింద 1,26,273 మంది భూ యజమానులు, కౌలు రైతులకు రూ.25.51 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రబీ 2021-22, ఖరీఫ్‌ 2022 కాలానికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 22,521 మంది లబ్ధిదారులకు రూ.4.38 కోట్లు అందించినట్లు తెలిపారు. ఎవరైనా అర్హులైన రైతులు ఈ విడతలో లబ్ధిపొందకపోతే వారు తమ పిర్యాదులను ఆఇవిల ద్వారా నమోదు చేసుకొనవచ్చని, ఫిర్యాదులు నిర్ణీత సమయంలో ఆర్‌టిజిఎస్‌ వారిచే పరిష్కారం అవుతాయని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందచేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, పీడీ ఆత్మా రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

నరసరావుపేటలో మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తదితరులు
పల్నాడు కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌తోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెన్రి క్రిస్టీనా, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2,58,386 మంది రైతులు, 20,076 మంది కౌలు రైతులు, 1719 మంది అటవీ భూమి సాగుదార్లకు రూ.56.70 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు కింద 38,476 మంది రైతులకు రూ.10.72 కోట్లు జమ చేసినట్లు వివరించారు. హెన్రి క్రిస్టీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతులకు మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందిస్తున్నారన్నారు. అనంతరం రైతులకు మెగా చెక్కును అందించారు.

➡️