రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

Jan 29,2024 20:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని అలకానంద కాలనీకి చెందిన ఎజ్జిరోతు రమేష్‌ (28) మృతదేహం సోమవారం అనుమానస్పద స్థితిలో రైలు పట్టాలపై లభ్యమయింది. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన రమేష్‌ తల్లి లక్ష్మి తో కలిసి స్థానిక అలకానంద కాలనీలో నివాసం ఉంటున్నాడు. లారీ డ్రైవర్‌ గా పనిచేస్తున్న రమేష్‌ ఆదివారం రాత్రి తన తల్లి లక్ష్మి వద్ద మద్యం సేవించేందుకు డబ్బులు తీసుకొని బయటకు వెళ్లాడు. తొందరగా వచ్చేస్తానని, అన్నం వండేసి ఉంచమని చెప్పి వెళ్లాడు. మద్యం కోసం బయటకు వెళ్లిన ఆయన అలకానంద కాలనీకి, ఇందిరానగర్‌కు మధ్య రైలు పట్టాలపై శవమై కనిపించాడు. రమేష్‌ తల, మొండెం వేరువేరుగా పట్టాలపై పడి ఉన్నాయి. బయటికి వెళ్లిన తన కుమారుడు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి తల్లి లక్ష్మి రాత్రంతా ఎదురుచూసింది. తెల్లవారి పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారాన్ని తెలుసుకొని ఆమె వెళ్లి చూసి, విగతజీవిగా పడి ఉన్న తన కుమారుడు రమేష్‌ను చూసి కన్నీటి పర్యంతరమైంది. జిఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ రవి వర్మ మృతదేహం పడి ఉన్న తీరును చూసి అనుమానస్పద మృతిగా గుర్తించి, స్థానిక వన్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. వన్‌ టౌన్‌ సిఐ బి. వెంకటరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని లైన్ల పట్టాలపైనా రక్తపు మరకలు ఉండడంతో హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్‌ టీం సహకారంతో అక్కడ ఉన్న ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతుని తల్లి లక్ష్మి, అక్క పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ పోలీసులు, విజయనగరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

➡️