లేగ దూడలతో ఆర్థికాభివృద్ధి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: లేగదూడలను సంరక్షించడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ బేబీరాణి అన్నారు. మండలంలోని ఎం వేములపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మట్టిపాడులో మంగళ వారం పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలు జాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బేబీరాణి మాట్లాడుతూ రైతులు దూడలకు సరిపడా పాలు అందజేస్తే దూడల మరణ శాతాన్ని తగ్గించవచ్చునన్నారు. పశుగణాభివృద్ధి సంస్థ ఒంగోలు సహాయ సంచాలకులు డాక్టర్‌ షేక్‌ కాలేషా మాట్లాడుతూ గర్భధారణ ద్వారా లేగ దూడల ఉత్పత్తిపై దృష్టి సారిస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం లేగ దూడలకు నట్టల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా అందమైన లేగదూడల యజమానులు ముగ్గురికి బహుమతులుగా పాలక్యాన్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు డాక్టర్‌ కృపారావు, డాక్టర్‌ బి ప్రతాప్‌రెడ్డి, గ్రామ సర్పంచి ఈర్ల విజయలక్ష్మి, గ్రామ నాయకులు మండవ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️