ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణ ఆపాలని నిరసన

నినాదాలు చేస్తున్న తాడి గ్రామస్తులు

ప్రజాశక్తి – పరవాడ

పరవాడ జెఎన్‌ ఫార్మసిటీ డెవలపర్‌ రాంకీ యాజమాన్యం తాడి గ్రామంలో చేపట్టనున్న ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణను తక్షణమే ఆపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం గ్రామంలోని జివిఎంసి సబ్‌ జోనల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తాడి గ్రామ సమీపంలో సర్వేనెంబర్‌ 116లో రాష్ట్ర ప్రభుత్వం మరో 50 ఎకరాలు కేడాయించడంతో రూ.200 కోట్లతో రాంకీ యాజమాన్యం ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణ పనులు చేపట్టనుందని, దీని వల్ల కాలుష్యం మరింత పెరగనుందని తెలిపారు. ప్రజలను పొమ్మనకుండా పొగే విధంగా రాంకీ యాజమాన్యం ఈ ల్యాండ్‌ ఫిల్‌ పనులకు సిద్ధమవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాండ్‌ ఫీల్డ్‌ వల్ల భూగర్భ జలాలు నాశనమై తాడి గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకొని స్థానికులు అల్లాడుతున్నారని, దీనికితోడు మరో కాలుష్య కుంపటి పెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణకు ఈనెల 30న పరవాడ తహశీల్దారు కార్యాలయంలో ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాన్ని తరలించాలన్నారు. గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణ పనులు చేపట్టడం దుర్మార్గమన్నారు. గ్రామస్తుడు పైల కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామాన్ని తరలించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ పరవాడలో పెట్టడం కాదని, దమ్ముంటే తాడి గ్రామంలో నిర్వహించాలన్నారు. తాడి గ్రామ నాయకుడు జి.మాధవరావు మాట్లాడుతూ గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్‌ ఫిల్‌ చేపడితే తాడి ప్రజలంతా కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పైడిరాజు, రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️