వంటింట్లో ‘తుపాను’ మంట

Dec 19,2023 23:54
మిచౌంగ్‌ తుపాను

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

మిచౌంగ్‌ తుపాను ఉద్యాన పంటలను నాశనం చేయడంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఉన్నఫలంగా కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో సామాన్యులకు వంటింట్లో మంట తప్పడం లేదు. జిల్లాలో ఈనెల 4 నుంచి వరుసగా మూడు రోజులపాటు తుపాను ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం గొల్లప్రోలు మండలం తాడిపత్రి, చేబ్రోలు, వన్నెపూడి, చందుర్తి, ఏ.విజయనగరం, చిన్న జగ్గంపేట, కొడవలి, దుర్గాడ, పిఠాపురం మండలం పి.దొంతమూరు, మాధవపురం, విరవాడ, విరవ, రాపర్తి, కుమారపురం, కోలంక, చిత్రాడ, మల్లం, యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి, కొండవరం, కొమరగిరి, గోర్స, పెద్దాపురం మండలం ఆర్బిపట్నం, వి.తిమ్మాపురం, జె.తిమ్మాపురం, కట్టమూరు, కాండ్రకోట, తిరుపతి, ఉలివేశ్వరం, గుడివాడ, జగ్గంపేట మండలం సీతానగరం, మామిడాడ, ఇర్రిపాక, కాట్రావులపల్లి, గుర్రంపాలెం, బలబద్రపురం, ఇంకా కాజులూరు, గండేపల్లి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి, కోటనందూరు, శంకవరం, రౌతులపూడి తదితర మండలాల్లో 117 గ్రామాల్లో సుమారు 2,400 ఎకరాల్లో ఉద్యాన, కూరగాయల పంటలకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. టమోటా, క్యాబేజీ, బెండ, వంగ, బీర తదితర పంటలు వర్షాలకు తుడిచి పెట్టుకుపోయాయి. ఇందులో 981 మంది రైతులకు చెందిన సుమారు 1200 ఎకరాల్లో కూరగాయల పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. మార్కెట్‌లోకి స్థానికంగా సాగైన కూరగాయలు రాకపోవడంతో గత వారం రోజులుగా వీటి ధరలు అమాంతం పెరిగాయి. మొన్నటి వరకు కార్తీక మాసం వలన ధరలు పెరగ్గా కార్తీకమాసం పూర్తి కావడంతో కూరగాయలు ధరలు దిగివస్తాయని అనుకున్న సామాన్యులకు తుపాను షాక్‌ ఇచ్చింది. సాధారణంగా కార్తికమాసంలో కూరగాయలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. పూజలు, ప్రతాలతోపాటు మాలధారుల సంఖ్య పెరగటం, అన్న సమారాధనలు వంటివి ఉండటంతో మిగతా రోజుల కంటే ఈ నెలలో కూరగాయల ధరలు సాధారణంగా పెరగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే డిసెంబరు మొదటి వారంలో తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో చేతికి అందివచ్చే పంటలు నేల మట్టం అయ్యాయి. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల ఇళ్లల్లో కూరగాయలు వండుకోవడానికి గత్యంతరం లేని పరిస్థితులు నెలకొన్నాయి. గంజి, చారు నీళ్లతో పూట గడుపుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.

➡️