‘వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలి’

ప్రజాశక్తి- రాయచోటి ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, రీసర్వే మూడవ దశ, ఇనామ్‌, అసైన్డ్‌ భూములు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్స్‌, గ్రామీణ అభివద్ధి- ప్రాధాన్యత భవనాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ – కరువు మండలాల్లో ఉపాధి పనుల కల్పన, తాగునీరు, పరిశ్రమల శాఖ – ఎంఎస్‌ఎంఇ క్లస్టర్‌లకు భూమి కేటాయింపు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సమావేశానికి రాయచోటి కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా ప్రాధాన్యత అంశాలలో సెక్టార్‌ వారీగా అభివద్ధి పనులలో పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో అన్ని రకాల అభివద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో కషి చేసి రోజువారి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్‌లను త్వరగా పూర్తి చేయాలన్నారు.పల్స్‌ పోలియో విజయవంతం చేయండి ఈనెల 3న జిల్లా వ్యాప్తంగా చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమంలో నూరు శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని, కంటి వెలుగు పథకం కింద ప్రభుత్వం నుంచి కంటి అద్దాలు అందగానే లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కార్డులకు ఇకెవైసి పూర్తి చేసి లబ్ధిదారులందరికీ త్వరితగతిన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా మండలాలలో ఉపాధి పనులు కల్పించాలన్నారు. ముఖ్యంగా కరువు ప్రాంతాలలో సెల్ఫ్‌ ఆఫ్‌ వర్క్స్‌ రూపొందించుకొని మెట్ట ప్రాంతాలలో ఫాం పాండ్స్‌, పెద్ద చిన్న పర్కులేషన్‌ ట్యాంకుల నిర్మాణం, మినీ అమత సరోవర్లు నిర్మించడానికి కషి చేయాలన్నారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ఇప్పటినుంచి తగిన ప్రణాళికలు రూపొందించుకొని, నీటి ఎద్దడి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా ఎంఎస్‌ఎంఇలకు ఉద్యం రిజిస్ట్రేషన్‌లను త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్గదర్శకాలను అనుసరించి రబీలో కరువు మండలాల జాబితాను రూపొందించాలన్నారు. బెంగాల్‌ గ్రామ్‌, గ్రీన్‌ గ్రామ్‌ ప్రొక్యూర్‌ మెంట్‌, ఎరువుల పంపిణీ సక్ర మంగా నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రాధాన్యత భవనాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️