వలంటీర్లు సేవా సారథులు

Feb 19,2024 22:04
ఫొటో : వలంటీర్లను సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : వలంటీర్లను సత్కరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
వలంటీర్లు సేవా సారథులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : కరోనా లాంటి విపత్కర పరిస్థితులు, వర్షాలు, వరదలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందచేసిన సంక్షేమ పథకాలను నిరంతరం అందజేసిన వలంటీర్లు సేవా సారథులు అని, వారికి సలాం చేస్తున్నామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి కొనియాడారు. సోమవారం ఆత్మకూరులోని శ్రీధర్‌ గార్డెన్స్‌లో వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని వరుసగా నాల్గవ సంవత్సరం నిర్వహించడంతో కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందజేయడంలో భాగస్వామ్యులైన వలంటీర్లను ఇలా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జగనన్న ఏర్పాటు చేసిన ఇలాంటి వ్యవస్థతో ప్రజలందరికీ ప్రభుత్వ పాలన, సంక్షేమం గడప ముంగిటకే చేరిందని, గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లు అత్యుత్తమ సేవలందిస్తుండడంతోనే తాము సైతం అభివృద్ధిని పనులను వేగవంతం చేసి ప్రజలకు అందజేయగలుగుతున్నామన్నారు. వలంటీర్లు అదేవిధంగా తమ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వలంటీర్‌ వ్యవస్థ అందజేస్తున్న సేవలను చూసి పక్క రాష్ట్రాల్లో సైతం అమలు చేసేందుకు ఆయా ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయని, జగనన్న మదిలో వచ్చిన ఈ ఆలోచనతో ప్రజలందరికి సంక్షేమం అందిందని, ఇది దేశానికే అదర్శంగా నిలిచిందని కొనియాడారు. వలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి పనుల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటారని, ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న పోటీ పరీక్షల్లో వలంటీర్లు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, వచ్చే సంవత్సరం ఇప్పుడున్న వలంటీర్లలో చాలామంది ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ సంపూర్ణాభివృద్ధికి ఎంవిఆర్‌ ఆమోద్‌ ఆత్మకూరు నియోజకవర్గంలోని వలంటీర్లందరి సహకారంతో ఇప్పటికే సమస్యా నమోదు పుస్తకం ద్వారా ప్రతి ఇంట్లో సమస్యలను తెలుసుకుంటున్నట్లు, అందులో చాలా వరకు సమస్యలను పరిష్కరించినట్లు, ప్రజా సమస్యలను, అభివృద్ధిని మరింత వేగంగా చేసేందుకు ఎంవిఆర్‌ ఆమోద్‌ (ఎంవిఆర్‌ ఆత్మకూరు మోడల్‌ ఆఫ్‌ డెవలపింగ్‌ హోలిస్టికల్లి)ను ఏర్పాటు చేసినట్లు ఎంఎల్‌ఎ మేకపాటి పేర్కొన్నారు. సోమవారం జరిగిన వలంటీర్ల అభినందన సభలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఎంవిఆర్‌ ఆమోద్‌ విధి విధానాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వలంటీర్లకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తెలుపుతున్న సమస్యలను ఎంవిఆర్‌ ఆమోద్‌ ద్వారా తెలియజేస్తే వెంటనే తమకు సమాచారం తెలుస్తుందని, ఆ సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించవచ్చని, వలంటీర్లు ఎంవిఆర్‌ ఆమోద్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, నియోజకవర్గంలోని ఎంపిపిలు బోయళ్ల పద్మజారెడ్డి, కేత వేణుగోపాల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్న లక్ష్మి, వైస్‌చైర్మన్‌ షేక్‌ సర్థార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ ఫజులుల్లా, సొసైటీ చైర్మన్‌ సానా వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ చైర్మన్‌ నారసింహారెడ్డి, కంటాబత్తిన రఘునాధరెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, షేక్‌.పర్వీన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️