వాడి వేడిగా మండల పరిషత్‌ సమావేశం

ప్రజాశక్తి-కొనకనమిట్ల: వేసవి కాలం రాకముందే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, చేతిపంపుల్లో నీటి ధార తగ్గిపోయిందని వైస్‌ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, సర్పంచులు పిన్నిక పిచ్చయ్య, పాలూరి లక్ష్మీవెంకటేశ్వర్లు, పి సిద్ధాభినబి ధ్వజమెత్తారు. ఆదివారం ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారులపై మండిపడ్డారు. వద్దిమడుగు, గనివానిపాడు, మునగపాడు, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లె, బచ్చలకూరపాడు గ్రామాలకు సాగర్‌ నీటి సరఫరా నెలల తరబడి నుంచి నిలిచిపోయిందని, ఆ శాఖ అధికారులు సర్వసభ్య సమావేశానికి ఎందుకు హాజరు కావటం లేదని వైస్‌ ఎంపీపీ మెట్టు ప్రశ్నించారు. ఉపాధి పనులకు సంబంధించిన నివేదికలు ఇవ్వకుండానే సమావేశంలో ఎపిఒ బుల్లెన్‌రావు మాట్లాడటం ఏమిటని ఆయన పని తీరుపై వైస్‌ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో జరిగే ఉపాధి పనుల వివరాలు సర్పంచులకు తెలియచెప్పకుండానే పనులు చేయడం ఏమిటని తప్పుపట్టారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని, గతంలో చర్చించిన సమస్యలను పరిష్కరించారా లేదా అన్న విషయాలపై నివేదికలు అందించాలని ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్‌పిటిసి అక్కిదాసరి కొండలు అధికారులను ఆదేశిం చారు. పొదిలి ఆర్టీసీ డిపో నుంచి కంభంకు బస్సు నడపాల ని, చిన్నారికట్ల సింగిల్‌విండో అధ్యక్షులు ఉడుముల కాశిరెడ్డి కోరారు. పొదిలి నుంచి మునగపాడు, ముమ్మాయిపాలెం వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వస్తోందని దీంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్‌ సిద్ధాభి నబి అన్నారు. ఈ సమావేశంలో ఎంఇఓ ఎస్‌కె డాంగేషరీఫ్‌, గొట్లగట్టు పిహెచ్‌సి వైద్యాధికారి వి నరేంద్ర, కొనకనమిట్ల పశువైద్యాధికారి అమూల్య, వ్యవసాయ అధికారి ప్రసన్న రంగలక్ష్మి, ఉద్యాన అధికారి రమేష్‌, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఇలు బాలాజీ నాయక్‌, నిరంజన్‌, నారాయణస్వామిలు ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి జి జెనీఫా, ఇఓఆర్‌డి ఆర్‌ జనార్దన్‌, మండల పరిషత్‌ కార్యాలయ పర్యవేక్షకులు రెహమాన్‌, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️