వాలంటీర్లే సంక్షేమ పథకాల వారధులు : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా నాల్గవ ఏడాది వాలంటీర్లను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలో 1630 మంది వాలంటీర్లకు గాను సేవావజ్ర 5, సేవారత్న 35, సేవామిత్ర 1590 మంది చొప్పున వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేశామని పేర్కొన్నారు. వాలంటీర్ల ఉద్యోగం ఎంతో బాధ్యత గలదని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రజలు ఒక ఇంటి పట్టా పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని నేడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలను పేదల ముంగిటకు చేర్చుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, ప్రతి కార్యక్రమం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేస్తూ రాష్ట్రంలో బెస్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అమలవుతోందన్నారు. ప్రజలు తమ సమయాన్ని వథా చేసుకోకుండా వాలంటీర్లకు ఒక ఫోన్‌ చేస్తే వారు ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్స్‌ తీసుకెళ్లి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరిస్తారన్నారు. నేడు ప్రజలు వాలంటీర్లపై ఎంతో నమ్మకం పెంచుకున్నారని ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజులలో వాలంటీర్లు మరింత బాగా పని చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ఆసీఫ్‌ అలీ ఖాన్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ ఆర్‌ఐ మల్లికార్జున పాల్గొన్నారు. సేవా వజ్ర నగదు పురస్కారం పొందిన 28 మందికి సర్టిఫికేట్‌, శాలువా, బ్యాడ్జ్‌, మెడల్‌, రూ.45 వేల నగదు బహుమతి ప్రదానం చేశారు. సేవా రత్న నగదు పురస్కారం పొందిన 165 మందికి సర్టిఫికేట్‌, శాలువా, బ్యాడ్జ్‌, మెడల్‌, రూ.30 వేల నగదు, సేవా మిత్ర నగదు పురస్కారం పొందిన 8174 మందికిి సర్టిఫికేట్‌, శాలువా, బ్యాడ్జ్‌, మెడల్‌, రూ.10 వేల నగదు బహుమతి ప్రదానం చేశారు.

➡️