విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

Dec 18,2023 20:49
ఎస్‌ఇ కార్యాలయం వద్ద నిరసన

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రాష్ట్రంలోని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలోలా డైరెక్ట్‌ పేమెంటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తిరుపతి ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఇ కార్యాలయం వద్ద యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. సోమవారం స్థానిక శ్రీనివాసపురంలోని ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. కుమార్‌ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగించారు. రాష్ట్రంలోని వేలాదిమంది విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రంలోని విద్యుత్‌ కార్మికులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. విద్యుత్‌ కార్మికులను ఎన్నికలకు ముందు రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 141 జీఓ కింద రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ఆ పరిధిలోకి విద్యుత్‌ కార్మికులు రారని మోసపూరితంగా వ్యవహరించారని అన్నారు. విద్యుత్‌ రంగాన్ని అదానీలకు అప్పజెప్పి కాంట్రాక్ట్‌ కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారని విమర్శించారు.జగన్మోహన్‌ రెడ్డి, బిజెపి సంయుక్త విధానాలతో విద్యుత్‌ రంగం లక్షా28 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని గుర్తు చేశారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎనిమిది సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచారని, కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో స్కిల్డ్‌ కార్మికులకు కనీస వేతనం 43 వేలకు పైగా ఇస్తుంటే రాష్ట్రంలో 26 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. నూతన షిఫ్ట్‌ ఆపరేటర్లకు వేతనాలు పెంచలేదని, స్మార్ట్‌ మీటర్ల రాకతో మీటర్‌ రీడర్ల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందని, బిల్‌ కలెక్షన్‌ ఏజెంట్లకు ఎన్‌ పీ ఏం కార్మికులకు, విద్యుత్‌ స్టోర్‌ హమాలీలకు, పీస్‌ రేట్‌ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం నిర్ణయించాలని కోరారు. ఆఖరుకు మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వడంలోనూ వివక్ష కొనసాగుతుందనిగుర్తు చేశారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల పట్ల తన వైఖరి మార్చుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి, సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్మినెంట్‌ ఉద్యోగుల సంఘం నేత శివప్రసాద్‌ రెడ్డి, కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, నేతలు ప్రసాద్‌, సుదర్శన్‌ బాబు, సోమ సుందరం, రవి, భార్గవ్‌, అల్లిముత్తు, శివారెడ్డి, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.సిఎండి సంతోష రావుకు వినతిధర్నా అనంతరం తమ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాయమని కోరుతూ సంఘ నేతలు సి ఎం డి సంతోష్‌ రావు, డైరెక్టర్‌ సుబ్బరాజు, సిజిఎం హెచ్‌ఆర్‌ డి రమాదేవి, ఎస్‌ఇ కష్ణారెడ్డి లను కలసి వినతి పత్రాలు సమర్పించారు.ఎస్‌ఇ కార్యాలయం వద్ద నిరసన

➡️