విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌, అంబేద్కర్‌ విగ్రవం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌ మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో ప్రత్యేక హోదా కల్పిస్తామని, పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి నాడు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాలలో హోదా హామీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం హోదా ఎవరు ఇస్తే వారికే మద్దతు 25కి 25 ఎంపీలు ఇస్తే హోదా ఎందుకు రాదో అని చెప్పి 23 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇస్తే పార్లమెంటులో కొట్లడకుండా కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర భవిష్యత్తును సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. ఎంతవరకు కొట్లాడారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం చివరి పార్లమెంటు సమావేశాలు అయిన కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర విభజన హామీల కోసం తెలుగోడు పౌరుషాన్ని ఢిల్లీలో చూపించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాబోవు 2 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, యువత ఓటు ద్వారా తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంతేకాకుండా కడప ఉక్కు కోసం గురువారం జంతర్మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహులు పాల్గొన్నారు

➡️