విశ్వకర్మ పథకంతో చేతివృత్తుల వారికి మేలు

మాట్లాడుతున్న జిల్లా పరిశ్రమల అధికారి శ్రీధర్‌

ప్రజాశక్తి-అనకాపల్లి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం విశ్వకర్మ పథకం చేతివృత్తుల కళాకారులకు వరం లాంటిదని జిల్లా పరిశ్రమల అధికారి జిఎం శ్రీధర్‌ తెలిపారు. స్థానిక వివి.రమణ రైతు భారతి కేంద్రంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంప్రదాయ కళాకారులకు ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. ఐదు నుండి ఏడు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. డిజిటల్‌ సేవ కార్డుతో ఆన్లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, దానికి జిల్లా అమలు కమిటీ ఆమోదముద్ర వేస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని 18 గుర్తించబడిన సాంప్రదాయ వ్యాపారాలలో ఉన్న కళాకారులు, అర్హులందరూ వినియోగించుకోవాలని సూచించారు. డిఎల్‌డివో మంజులవాణి మాట్లాడుతూ వాలంటీర్లు, మహిళా సంఘాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఎమ్‌ఎస్‌ఎంఇ కోఆర్డినేటర్‌ ఏడి ఏ శ్రీనివాసరావు విశ్వకర్మ పథకం ఉద్దేశాలు విధి విధానాలను గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శచీదేవి, డిపిఓ శిరీష రాణి లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు, ఏటి డబ్ల్యు ఓ నాగ శిరీష, డొమైన్‌ నిపుణులు నాగేశ్వరరావు పరమేశ్వరరావు విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు గంగారాం పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి జేజిబాబు సి ఎస్‌ సి హెడ్‌ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️