వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

Dec 9,2023 23:20
వెయిట్‌ లిఫ్టింగ్‌

ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు రోజా, వేణుగోపాలకృష్ణ
సౌత్‌, వెస్ట్‌జోన్‌ నుంచి పోటీపడనున్న800 మంది క్రీడాకారులు
ప్రజాశక్తి – రాజానగరం
రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో సౌత్‌ అండ్‌ వెస్ట్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌-2023-24 పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథులుగా టూరిజం, సాంస్కృతిక, యువజన, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కె.రోజా, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విసి కె.పద్మరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో రోజా మాట్లాడారు. క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరుతేవాలని ఆకాంక్షించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి మరింత నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ ఖేలో ఇండియా ప్రాజెక్టు తరఫున రూ.20 కోట్ల నిధులకు ప్రపోజల్స్‌ పంపగా దానిలో మొదటి విడతగా రూ.8.3 కోట్ల విడుదలయ్యాయన్నారు. వీటిలో ఇండోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధుల్ని విడుదల చేసేలా కృషి చేస్తానన్నారు. రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ సీతానగరంలో మల్టీ లెవెల్‌ ఇండోర్‌ స్టేడియం, దివాన్‌ చెరువు పరిధిలో మరొక మల్టీ లెవెల్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలను చేపడుతున్నా మన్నారు. విసి పద్మరాజు మాట్లాడుతూ 11 రాష్ట్రాల నుంచి 90 విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. వీరందరికీ తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం వివిధ రకాల క్రీడా పుస్తకాలను మంత్రులు ఆవిష్కరించారు. విసి వారిని శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.ధ్యానచంద్ర, సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌.రాజు, జెఎన్‌టియుకె విసి విఆర్‌.ప్రసాదరాజు, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గవర్నింగ్‌ బాడీ మెంబర్‌, అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి, వెయిట్‌ లిఫ్టింగ్‌ ఒలింపియన్‌ ఎం.వి.మాణ ిక్యాలు, ఇండియన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బడేటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️