వేడుకగా రథోత్సవం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తిరుమల తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అఖిలాండ నాయకుడు కడప రాయుడు కొలువు దీరిన రథాన్ని భక్తులు పోటీపడి ఊరేగించారు. రథోత్సవం కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన జనసంద్రం నడుమన శ్రీవారి రథోత్సవం రంగరంగ వైభోగంగా ప్రారంభమైంది. తొలుత టెం కాయ కొట్టి రథోత్సవాన్ని ముందుకు సాగించారు. తేరుపై గంభీరముద్ర సుందర స్వరూ పులైన ఉత్సవమూర్తులను ప్రజలు తనివితీరా తిలకించి పులకించిపోయారు. రథం ముందుకు సాగుతుండగా భక్తులు గుమ్మడి కాయలు రథచక్రాల కింద ఉంచి మొక్కలు తీర్చు కున్నారు. దేవునికడపలో ఘనంగా రథ ఊరేగింపు అనంతరం శ్రీవారి తేరు తిరిగి తన నిజస్థానంలో నిలిచింది. కడప రాయుడి సన్నిధిలో ఉప ముఖ్యమంత్రి.. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ భాష సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. పండుగలు, ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలను నలుదిక్కులా పరిమళింపజేస్తాయని పేర్కొన్నారు.

➡️