వైసిపిలో భర్త..టిడిపిలోకి భార్య

Mar 4,2024 21:29

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఔను…! భర్త వైసిపిలో కొనసాగుతుండగా భార్య టిడిపిలోకి జంప్‌ అయ్యారు. ఒకరు ఉన్న పదవి కోసం పార్టీలో కొనసాగుతుండగా, మరొకరు పంతం నెగ్గించు కునేందుకు పార్టీ మారిపోయారు. దీంతో, ఎమ్మెల్సీ రఘురాజు రాజకీయ చదరంగం మరోసారి తేటతెల్లమైంది. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఈసారి పక్కనబెట్టా లంటూ ఎమ్మెల్సీ రఘురాజు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే అల్టిమేటం జారీచేయడంతో వ్యవహారం ముదర పాకానపడింది. రఘురాజు అల్టిమేటంపై సిఎం సీరియస్‌ అయ్యారట. పోతే పోనీ అన్నట్టుగా వ్యవహరించడంతో కొద్దిరోజులపాటు తటపటాయించిన రఘురాజు సతీమణి, ఎస్‌.కోట వైఎస్‌ ఎంపిపి సుబ్బలక్ష్మి(సుధారాణి) సహా కొంతమందిని టిడిపిలోకి పంపేందుకు ప్రణాళిక రూపొందించారు. పథకం ప్రకారం మండలంలోని కొంతమంది ఎంపిటిసి సభ్యులు, సర్పంచులతో కలిసి సుబ్బలక్ష్మి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యన సోమవారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీని వీడితే ఉన్న ఎమ్మెల్సీ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉండడంతో కొంతకాలం కొనసాగే ఉద్ధేశంతో ఉంటానంటూ అనుయాయులకు రఘురాజు నచ్చజెప్పినట్టుగా చర్చ నడుస్తోంది. ఈ తరహా రాజకీయం అటు వైసిపి తరపున పోటీచేయ బోయే కడుబండి శ్రీనివాసరావును ఓడించి పంతం నెగ్గించు కోవడానికి టిడిపిలోనూ, ఇటు పదవి కోసం వైసిపిలోనూ భార్యా భర్తలు చేరిపోయారని జనం చర్చించుకుంటున్నారు. రఘురాజు ఏ పార్టీలోకి వెళ్లినా ఇటువంటి పరిణామాలే చవి చూడాల్సి వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రఘురాజుకు పార్టీ మారడం, నమ్మి సీట్లు, పదవులు ఇచ్చిన పార్టీని సైతం వదిలేయడం కొత్తేమీ కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఆయన రాజకీయ ప్రస్థానం కూడా కనిపిస్తోంది. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎస్‌.కోట అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించినప్పటికీ, కొన్ని కారణాలవల్ల వెనక్కి తీసుకుంది. దీంతో, స్వతంత్రంగా పోటీకి దిగడంతో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2014లో టిక్కెట్‌ సాధించు కున్నప్పటికీ ఓటమి చెందారు. ఆ తరువాత కొంత కాలానికే బిజెపిలో చేరి కమలం కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసిపిలో చేరి టిక్కెట్‌ కోసం ప్రయత్నం చేశారు. తొలి నుంచీ పార్టీలోవుంటూ, 2014లో గజపతి నగరంలో ఓటమి చెంది, తిరిగి 2019లో టిక్కెట్‌ కోసం ఎదురు చూస్తున్న కడుబండి శ్రీనివాసరావు ను, మంత్రి బొత్స సత్య నారాయణ సోదరుడు అప్పలనర్సయ్య కోసం తప్పించారు. దీనికితోడు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడుబండికి ఎస్‌.కోటలో అవకాశం ఇచ్చారు. ఇదే నియోజక వర్గంలో ఉంటున్న రఘురాజును పార్టీకోసం పనిచేయాలని, అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొంత కాలానికే ఆ పదవి రఘురాజును వరించింది. పదవి వచ్చాక తాను అనుకున్నదే జరగాలన్నట్టుగా వ్యవహరి ంచడంతో స్థానిక ఎమ్మెల్యే కండబండితో విభేదాలు ఏర్పడ్డాయి. జిల్లాలోని ఓ కీలకనేత రఘురాజుకు సహకరించడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఆ సారి ఎమ్మెల్యేకు సీటు రాదని, రానివ్వనని, ఇవ్వవద్దని అనే స్థాయి వరకు వెళ్లడంతో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఒకానొకదశలో భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ రఘురాజును సుతిమెత్తగా మందలించారు. ఆ తరువాత పరిస్థితి మారలేదు సరికదా ఎన్నికల్లో కడుబండిని మార్చకపోతే తానే మారిపోతానంటూ అధిష్టానాన్ని హెచ్చరించేవరకు వచ్చింది. దీంతో, వైసిపి అధిష్టానమే వదిలించు కోవాలనుకుందో ఏమో…ఇటీవలే టిడిపి నేతలతో మంతనాలు జరిపిన రఘురాజు తన భార్యను, ఇతర నాయకులను ఆపార్టీలోకి పంపారు. ఇప్పటికే ఎస్‌.కోట టిడిపిలో బహు నాయకత్వం సీటు కోసం ఫీట్లు చేస్తున్న నేపథ్యంలో రాఘురాజు రాకతో గందరగోళంగా మారుతుందని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️