వైసిపిలో సిట్టింగ్‌లకే సీట్లు

Mar 16,2024 21:57

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  మే 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజాం, అరకు పార్లమెంట్‌ మినహా మిగిలిన అన్ని చోట్లా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మరోసారి అవకాశం లభించింది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించగా, అరకు ఎంపి అభ్యర్థిగా డాక్టర్‌ శెట్టి తనూజారాణిని ప్రకటించారు. ఇడుపులపాయలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైపిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎంపి అభ్యర్థుల పేర్లను, బాపట్ల ఎంపి నందిగామ సురేష్‌ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయనగరం నియోజకవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, చీపురుపల్లి నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం నుంచి బొత్స అప్పలనర్సయ్య, ఎస్‌.కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు, బొబ్బిలి నుంచి శంబంగి వెంకట చినఅప్పలనాయుడు పేర్లను ఖరారు చేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులకు పాయకరావు పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రాజాంలో తలే రాజేష్‌కు అవకాశం కల్పించారు. అటు జోగులకు కూడా పాయకరావుపేటలో పోటీకి పార్టీ అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు టిక్కెట్‌ ఖరారు చేశారు. జిల్లా పార్టీ సమన్వయ కర్త, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మినహా మరెవ్వరూ టిక్కెట్లు ఆశించేవారు లేకపోవడం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీలకు కలిసివచ్చింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కోసం ఎదురు చూసిన శ్రీనివాసరావు కు మాత్రం ఒకింత నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వైసిపి అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించడం తో అభ్యర్థిత్వం ఎవరికి కల్పిస్తారో అన్న సందిగ్ధం వీడిపోయింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావడంతో అభ్యర్థులతోపాటు వారి అనుయా యులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. పలుచోట్ల పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. ఒకరిద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత, అవినీతి ఆరోపణలు వున్నప్పటికీ పార్టీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి వాటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర ఐదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అరకు ఎంపీగా పోటీ చేయాలనే అభిప్రాయాన్ని ఆయన పలుమార్లు వ్యక్తం చేసినా అధిస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలైన పుష్ప శ్రీవాణి, కళావతిలకే మరోసారి అవకాశం దక్కింది. వీరిద్దరూ మూడోసారి కదనరంగంలోకి దూసుకుపోతున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరుకు పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్‌ శెట్టి తనూజారాణిని అధిష్టానం ప్రకటించింది.

➡️