వైసిపి పాలనలో టిడ్కో ఇళ్లు నిర్వీర్యం

Mar 28,2024 22:35

టిడ్కో ఇళ్లను పరిశీలిస్తున్న చంద్రశేఖర్‌, మనోహర్‌
ప్రజాశక్తి-తెనాలి :
వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఐదు దశాభ్దాలు వెనక్కు మళ్లిందని, మరోసారి తప్పు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. పన్నుల భారంతో విసిగి వేసారిపోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా చెత్తపన్ను రద్దు చేస్తామన్నారు. స్థానిక ‘ఎ’ కన్వెన్షన్‌ హాల్లో హోటల్స్‌ అండ్‌ ఫుడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ నాయకులు సూరపనేని నాగేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తొలుత హోటల్స్‌, ఫుడ్‌ జంక్షన్లు, క్యాటరింగ్‌ విభాగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్‌ చంద్రశేఖర్‌, మనోహర్‌ మాట్లాడుతూ చెత్తపన్ను వసూలు దారుణమన్నారు. అధికారంలోకి రాగానే చెత్తపన్నును తక్షణమే రద్దు చేస్తామన్నారు. ఇతర పన్నుల భారాన్ని పరిశీలించి, క్యాటగిరీలుగా విభజించి, వ్యాపారులకు భారం తగ్గిస్తామని చెప్పారు.
టిడ్కో ఇళ్లు నిర్వీర్యం..లబ్ధిదారులకు శాపం
పూలే కాలనీలో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను డాక్టర్‌ చంద్రశేఖర్‌, మనోహర్‌ పరిశీలించారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జగన్‌ పేదల పక్షపాతి కాదని కక్షపాతని ఎద్దేవా చేశారు. కేవలం కక్షపూరిత దోరణితో టిడ్కో గృహనిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి, లబ్ధిదారులకు దక్కకుండా చేసిందన్నారు. లబ్ధిదారుల వాటా కింద అప్పులు తెచ్చి చెల్లించారని, వారికి ప్రభుత్వం ఏమి సమాదానం చెబుతుందని ప్రశ్నించారు. చేసిన అప్పుకు వడ్డీ కట్టలేక, మరోవైపు బ్యాంకు నుంచి అందించిన రుణసౌకర్యానికి తాకీదులు వస్తుంటే పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. లబ్ధిదారులపై రుణభారం, అప్పుల భారం పెరిగిందన్నారు. మనోహర్‌ మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో పేదలకోసం నిర్మించిన గృహ సముదాయాలను నాశనం చేసి, వైసిపి ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందన్నారు. నిర్మాణాలను కూల్చటం తప్ప, కొత్త నిర్మాణాలు చేపట్టే సంస్కృతి వైసిపికి దూరమన్నారు. విధ్వంశాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమాల్లో నాయకులు ఎ.జయలక్ష్మి, వి.మురళి, హెచ్‌.గౌరీశంకర్‌, జె.రెణుక, కె.నాగభూషణం, షేక్‌ కాలేషా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టిడిపి పార్లమెంటరీ కార్యాలయాన్ని స్థానిక కొత్తపేటలో నాదెండ్ల మనోహర్‌తో కలిసి చంద్రశేఖర్‌ ప్రారంభించారు.

➡️