వైసిపి హయాంలో బిసిలకు అన్యాయం : ముద్దరబోయిన

ప్రజాశక్తి – ముసునూరు

రాష్ట్రంలో బిసిలకు సిఎం జగన్‌ తీవ్రఅన్యాయం చేశారని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలకేంద్రం ముసునూరులోని బిసి కాలనీలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైసిపికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సైకో ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బిసిలపై, బిసి నాయకులపై దౌర్జన్యాలు, అక్రమాలు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం బిసిలకు చేసింది ఏమీలేదన్నారు. గత టిడిపి పాలనలో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రిజర్వేషన్లు 24 శాతానికి, ఆ తరువాత చంద్రబాబు 34 శాతానికి పెంచిన ఘనత ఉందన్నారు. అదనంగా బిసి సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.36475 కోట్లు ఖర్చుపెట్టి రూ.4.20 లక్షల మందికి బిసి కార్పొరేషన్‌ ద్వారా ఆదరణ పరికరాలు అందించారని తెలిపారు. గతంలో 1127 కమ్యూనిటీ భవనాలను బిసిలకు కేటాయించిన ఘనత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గద్దె రఘుబాబు, సర్పంచి కొండేటి విజయలక్ష్మి బాబి, టిడిపి గ్రామ అధ్యక్షులు పాకనాటి ఆంజనేయులు, మేదరమెట్ల సురేంద్ర, రెడ్డి కృష్ణ, గారపాటి నరసింహారావు, కందుల పిచ్చియ్య పాల్గొన్నారు.

➡️